సింగరేణి కార్మికులు(ఫైల్)
గోదావరిఖని(రామగుండం): ‘అన్ని దుకాణాలు తెరువుమన్నడు.. మద్యం అమ్ముతమని చెప్పిండు.. రైతుకు తక్లీబ్ కాకుండా చూస్తమన్నడు.. లాక్‌డౌన్‌తో లాయర్లు తిప్పలువడుతున్నరు.. వాళ్లకు రూ.15 కోట్లు రిలీజ్ చేస్తన్నమన్నడు.. కానీ నెల రోజుల సంది బొగ్గుబాయిల లేఆఫ్ చెయ్యవట్టి ఇంటికాడనే ఉండవడ్తిమి.. మన గురించి ఒక్క ముచ్చటన్న మాట్లాడకపాయె.. మన సీఎం సారు.. ఇప్పటికే ఏప్రిల్‌లో సగం జీతమే వచ్చింది. ఈ నెలంతా గిట్లనే లేఆఫ్ ఉంటే ఎట్ల’ అని చర్చించుకుంటున్నారు సింగరేణి భూగర్భ గనుల కార్మికులు.
కరోనా విజృంభణతో సింగరేణిలో కూడా ఒకరిద్దరు కార్మికులకు మార్చి చివరి వారంలో పాజిటివ్ వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కార్మిక కుటుంబంలో ఇద్దరికి కూడా పాజిటివ్ రావడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. పనిస్థలాల్లో కార్మికులు భౌతిక దూరం పాటించడం సాధ్యం కాకపోవడం.. కరోనా భయం నెలకొనడంతో డీడీఎంఎస్ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం గత నెల 2న 22 భూగర్భ గనులు మూసివేసింది. దీంతో ఉప్పత్తి నిలిచిపోవడంతో పాటు వివిధ భూగర్భ గనుల్లో పనిచేసే 22వేల పైచిలుకు కార్మికులు కూడా ఏప్రిల్‌కు సంబంధించి సగం వేతనాలు కోల్పోయారు. మార్చి వేతనంలో ప్రభుత్వమే 50 శాతం కోత విధించింది.
వరుసగా రెండు నెలలు సగం జీతమే..
సంస్థ వ్యాప్తంగా 22భూగర్భ గనుల్లో పనిచేస్తున్న 22వేల మంది కార్మికులు వరుసగా మార్చి, ఏప్రిల్‌లో సగం వేతనం కోల్పోయారు. ప్రస్తుతం సింగరేణి ప్రభావిత జిల్లాల్లో కరోనా ఉధృతి తుగ్గుముఖం ప ట్టింది. కొత్తగా కేసులు నమోదు కావడంలేదు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో భూగర్భ గనుల లేఆఫ్ ఎత్తివేతపై సీ ఎం నిర్ణ యం తీసుకుంటారని కార్మికులు భావించా రు. స మావేశంలో సింగరేణికి సంబంధించి ప్రస్తావనలేకపోవడం, విలేకరుల సమావేశంలో కూడా సీఎం ఎ లాంటి ప్రకటన చేయకపోవడంతో లే ఆఫ్ గనుల్లో పనిచేసే కార్మికులు నిరుత్సాహానికి గురయ్యారు..
గనులు తెరవాలంటున్న కార్మికులు..
కరోనా దెబ్బతో భూగర్భ గనులు మూతపడి నెల దాటిన నేపథ్యంలో లే ఆఫ్ ఎత్తివేయాలని కార్మికులు కోరుతున్నారు. సింగరేణి ప్రభావిత జిల్లాల్లో క రోనా కేసులు కొత్తగా నమోదు కానందున తాము విధులు నిర్వహించేందుకు సిద్ధమని పేర్కొంటున్నా రు. లే ఆఫ్ ఎత్తివేస్తే సంస్థతోపాటు, తమకూ లాభం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
డీజీఎంఎస్ ఆదేశాలు వస్తేనే..
లే ఆఫ్ ఎత్తివేయాలంటే డీడీఎంఎస్ నుంచి ఉత్తర్వులు రావాలని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో విధుల నిర్వహణ, ఉత్పత్తి గురించిన గైడ్‌లైన్స్ కూడా జారీ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. లే ఆఫ్ ఎత్తివేయడం సింగరేణి యాజమాన్యం చేతిలో లేదని చెబుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment