
పెద్దపల్లి/మంచిర్యాలక్రైం: ఎంత చెప్పినా వినకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కొత్త పద్ధతుల్ని అమలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాతోపాటు మంచిర్యాలలో.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని నేరుగా ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. గురువారం జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, మంథని, మంచిర్యాలలో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన ఆకతాయిలను సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
ఇక రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారి సెల్‌ఫోన్లు లాక్కొని ప్రత్యేక వాహనాల ద్వారా 79 మందిని బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌కు తరలించారు. వారి కుటుంబసభ్యులను పిలిపించి కోవిడ్ కష్టాలు ఎలా ఉంటాయో వివరిస్తూ.. 4 గంటలపాటు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలి పెట్టారు. ఇప్పటికైనా అనవసరంగా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు.