
బోల్‌బేబీ బోల్ కార్యక్రమంలో.. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీజయరామ్‌తో..
పోచారం: పదిమందిలో ఉన్నప్పుడు మనకుంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. ప్రస్తుత తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అలాగే ఆలోచిస్తున్నారు. తమ పిల్లలకు చదువుతో పాటు కళారంగాల్లోనూ ప్రోత్సాహం అందిస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిందే పాటల కోకిల ‘వజ్జల అద్వితీయ’. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ బాలిక పాటల తోటలో స్వేచ్ఛగా విహరిస్తోంది. తల్లిదండ్రులు సుమంగళి, రాఘవేంద్రతో పాటు పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో నివసించే అమ్మమ్మ ఆదిలక్ష్మి, తాతయ్య జగన్మోహన్‌రావు ప్రోత్సాహంతో అద్వితీయ శాస్త్రీయ, లలిత సంగీతం నేర్చుకుంది. దాంతో పలు వేదికలపైన, పోటీల్లోనూ ప్రతిభను నిరూపించుకోవడంతో సినీ పాటలు పాడే అవకాశాన్ని సైతం అందిపుచ్చుకుంది.
జెమినీ టీవీ ప్రసారం చేసే ‘బోల్ బేబీ బోల్’లో రెండు సీజన్ల పాటు సంగీత ప్రియులను అలరించిందీ చిన్నారి. ‘నందు ఎట్‌ది రేట్ ఆఫ్ 24’ షార్ట్ ఫిల్మ్‌కు టైటిల్ సాంగ్ పాడి ఆకట్టుకుంది. ఇక ‘పాడుతా తీయగా’, దూరదర్శన్ ‘ఆలాపన’ వంటి టీవీ కార్యక్రమాల్లో తన గళం వినిపించి ఉద్దండుల మొప్పు పొందింది. ‘స్పైడర్, మహానటి, ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల ఆడియో లాంచింగ్ కార్యక్రమంలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది అద్వితీయ. సంగం సంస్థ నిర్వహించిన సంగీత పోటీల్లో రాష్ట్రస్థాయి విజేతగా నిలవడంతో పాటు, సచ్చిదానంద కళాపీఠం నుంచి బాల పరిమళం, బాల గాన సౌరభం, రసమయి ఉగాది పురస్కారాల్లో ‘గానకోకిల’ బిరుదులు తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రెండు గంటలు నిర్విరామంగా సోలో, యుగళ గీతాలు పాడి ‘ట్రెడిషన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించుకుంది.
మలేసియాలోనూ ‘అద్వితీయం’గా..
చిన్నారి అద్వితీయ రెండున్నరేళ్లు మలేసియాలో చదువుకుంది. అక్కడ తెలుగు వారి ఉగాది వేడుకల్లో తన గాన మాధుర్యాన్పి పంచింది. మలేషియాలోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటూనే ఆన్‌లైన్‌లో విజయలక్ష్మి వద్ద సంగీత పాఠాలు నేర్చుకుంది. బాలిక సంగీత ప్రతిభను గుర్తించిన ఆ స్కూల్ అద్వితీయను ‘మెలోడి సింగర్’ అవార్డుతో సత్కరించింది. మలేసియాలోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో జరిగే భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం తన గళం వినిపించింది.
తెలుగు ఎక్స్‌పర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించి పలు ప్రాంతాల్లోని తెలుగు వారిని అలరించింది. అద్వితీయ మాట్లాడుతూ.. లక్ష్మణాచారి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో గురువులు టి.వాణిశ్రీ, వేదల శశికళ, ఎన్.సి.శ్రీదేవి అందించిన ప్రోత్సాహంతో తాను ఇంతటి గుర్తింపు పొందానని వినమ్రంగా చెబుతోంది. తన మిత్రులు సౌమ్య, అనుష్క, సమ్యుక్త, సాత్విక బృందంతో కలిసి పలు సంగీత విభావరులు నిర్వహించి రూ.25 లక్షల విరాళాలు సేకరించి కేన్సర్ రోగుల సహాయార్ధం గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్‌కు అందించి తన సేవాభావం చాటుకుంది అద్వితీయ.
Comments
Please login to add a commentAdd a comment