‘స్కిల్ ఇండియా’ మోదీ లక్ష్యం
- కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా
- నిమ్స్‌మేలో జాబ్‌మేళా ప్రారంభం
వెంగళరావునగర్: మన దేశాన్ని ‘స్కిల్ ఇండియా’గా మార్చడమే ప్రధాని మోదీ లక్ష్యమని ఎంఎస్‌ఎంఈ కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (నిమ్స్ మే)లో ఆదివారం మెగా జాబ్‌మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిశ్రా మాట్లాడుతూ మనదేశంలోని యువతకు కావాల్సినంత స్కిల్ ఉందని, అయితే దానిని ఉపయోగించుకోవడంలోనే లోపం ఉందన్నారు.
అందువల్లనే నిరుద్యోగ సమస్య అధికమయ్యిందన్నారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువతకు ఉపాధి శిక్షణ కోర్సులు అందించేందుకు దాదాపు 5 వేల కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యువత ఎప్పుడూ ఖాళీగా ఉండవద్దని, దాని వల్ల దేశం వెనక్కు పోతుందన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి యువతీ యువకుడికి ఈ జాబ్‌మేళాలో తప్పనిసరిగా ఉద్యోగం దొరుకుతుందని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాబ్‌మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యుత్ సమస్యపై స్పందించాలి
తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రమై ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కార్యక్రమానికి హాజరైన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రభుత్వం విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలన్నారు. యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు ఎంతో అవసరమని, అవి నడవాలంటే విద్యుత్ కావాలన్నారు. నిరంతర విద్యుత్ లేకపోవడం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు పూర్తిస్థాయిలో నడవడం లేదన్నారు. విద్యుత్ సమస్యపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని, పార్లమెంట్‌లో కూడా ప్రస్తావిస్తానన్నారు.
నిమ్స్‌మే ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా శాఖల ప్రతినిధులపై ఉందన్నారు. తన నియోజకవర్గంలో తొలిసారిగా మెగా జాబ్‌మేళాను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిమ్స్‌మే డెరైక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, టీఎంఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి.మురళీధరన్, ఎన్‌ఐఈఎస్‌బీయుడీ డెరైక్టర్ జనరల్ అరుణ్‌కుమార్, ఎన్‌ఎస్‌ఐసీ సీఎండీ రవీంద్రనాధ్, ఎస్‌ఎంఈ జాయింట్ సెక్రటరీ ఎన్.ఎన్.త్రిపాఠి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.