కూలిన శ్లాబ్
- హెచ్‌సీయూలో ఘటన
- త్రుటిలో తప్పిన ప్రమాదం
- నాలుగేళ్లలో రెండో ఘటన
సెంట్రల్ యూనివర్సిటీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.13.80 కోట్లతో నిర్మిస్తున్న జాకీర్ హుస్సేన్ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ శ్లాబ్ బుధ వారం కుప్ప కూలింది. నాలుగేళ్ల క్రితం లైఫ్ సైన్స్ భవనం కూలిన ఘటన మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. తక్కువ సామర్థ్యం గల ఇనుపరాడ్‌లు ఉపయోగించడం, శ్లాబ్ భీంను ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది.
మధ్యాహ్నం సమయంలో భవన నిర్మాణం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2014 జనవరి నుంచి సీపీడ బ్ల్యూ పర్యవేక్షణలో బెంగుళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఈ ఈ భవన నిర్మాణ పనులు చేస్తోంది. ఏప్రిల్ 2015 కల్లా పనులను పూర్తి చేయాల్సి ఉంది.
ఈ భవనంలో లెక్చర్ హాల్ కాంప్లెక్స్‌తో పాటు అకడమిక్ సపోర్ట్ సెంటర్, లైబ్రరీ, క్లాస్ రూంలు, సెమినార్ హాల్ వంటి 15 హాళ్లు నిర్మిస్తున్నారు. ఘటన స్థలాన్ని హెచ్‌సీయూ రిజిస్టార్ రామబ్రహ్మం, సీపీడబ్ల్యూ అధికారులు, మాదాపూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఖురేషీ, విద్యార్థి, ఉద్యోగ సంఘ నాయకులు పరిశీలించారు.
ఉన్నత స్థాయి విచారణ కోరతాం...
శ్లాబ్ కూలిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కోరతాం. ఇన్‌చార్జి యూఈ ఏసీ నారాయణ హయాంలో చేపట్టిన అన్ని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలి. నాసిరకంగా చేపట్టిన ఈ భవనం నిర్మాణం పూర్తయ్యాక కూలి ఉంటే భారీ ప్రాణ, ఆస్తినష్టం జరిగి ఉండేది.
- బండి డానియల్, యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
నాసిరకంగా నిర్మిస్తున్నారు...
యూనివర్సిటీ భవన నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. విద్యార్థుల భవిష్యత్‌ను కాల రాసేలా నాసిరకంగా భవనాలు నిర్మిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
- వెంకటేష్ చౌహాన్, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు, హెచ్‌సీయూ