పీపీపీ..ఇక హ్యాపీ!
- తెరపైకి కొత్త ప్రతిపాదనలు
- పీపీపీ విధానంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
- హామీని నిలబెట్టుకునేందుకు యత్నాలు
- ఖజానాపై భారం పడకుండా సర్కారు జాగ్రత్తలు
సాక్షి, సిటీబ్యూరో: స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామన్న ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ హామీని నిలబెట్టుకోవడంతో పాటు... అదే సమయంలో ఖజానాపై భారం పడకుండా చూడాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తోంది. ఇకపై పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో ఈ ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా అటు ప్రజల వద్ద మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని...తమకు భారం తప్పుతుందని భావిస్తోంది. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇంతవరకూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెచ్చించే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇది ఆర్థికంగా భారంగా మారుతుండడంతో కొత్త దారి వైపు చూస్తోంది.
ఎస్సార్ నగర్‌తో శ్రీకారం
తొలుత ఎస్సార్‌నగర్-అమీర్‌పేట మార్గంలోని ‘స్టేట్ హెల్త్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్’ (ఎస్‌హెచ్‌టీఓ)కు చెందిన స్థలంలో ఈ విధానంలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్, హాల్, వంటగది, రెండు మరుగుదొడ్లతో కూడిన ఇళ్లు నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి సమీపంలోని ఐడీహెచ్ కాలనీలో 396 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ప్రభుత్వం రూ.36.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఐమాక్స్ సమీపంలోని ఇందిరా నగర్‌లోనూ మరో 250 ఇళ్లకు దాదాపు రూ.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో ఐడీహెచ్ కాలనీలో జీప్లస్ టూ విధానంలో నిర్మిస్తున్నారు. ఇందిరానగర్‌లో జీప్లస్5 పద్ధతిలో కట్టేందుకు ప్రతిపాదిస్తున్నారు.
నగరంలోని పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇకపై పీపీపీ పద్ధతిలో నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగైదు అంతస్తుల్లో పేదలకు అవసరమయ్యే ఇళ్లను లిఫ్ట్‌లతో పాటు సకల సదుపాయాలతో నిర్మించాలని యోచిస్తోంది. వీటి నిర్మాణ వ్యయాన్ని భరించే సంస్థకు మొత్తం బిల్టప్ ఏరియాలో దాదాపు 50 శాతం ఇవ్వాలనేది ప్రాథమిక యోచనగా తెలిసింది. తద్వారా ఇటు తమపై భారం తప్పడంతో పాటు అటు బిల్డర్‌కూ లాభసాటి గా ఉంటుందనే ఈ ప్రతిపాదనలకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
భారం పడకుండా...
రాబోయే రెండేళ్లలో పేదల కోసం దాదాపు పదివేల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం. నగర శివార్లలో... ఎక్కడో దూరంగా కాకుండా మంచి డిమాండ్ ఉన్న బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ పేదలకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో గృహాలు నిర్మిస్తున్నారు. పేదల ఇళ్ల కోసం ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. స్థల సమస్య తీరుతున్నప్పటికీ నిర్మాణ భారం తీవ్రమవుతోంది. పీపీపీ విధానంతో ప్రభుత్వంపై భారం లేకుండానే ఇళ్లను పూర్తి చేయవచ్చునని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
అమీర్‌పేటలో ఎస్‌హెచ్‌టీఓకు చెందిన ఏడెకరాల స్థలాన్ని ఇటీవలే జీహెచ్‌ఎంసీకి బదలాయించారు. జీప్లస్ 3 విధానంలో కడితే ఎకరాకు వంద ఇళ్ల చొప్పున ఏడెకరాల్లో దాదాపు 700, జీప్లస్5 పద్ధతిలో అయితే వెయ్యికిపైగా ఇళ్లు నిర్మిం చగలరని అంచనా. దాదాపు 580 ఎస్‌ఎఫ్‌టీతో వీటిని నిర్మించనున్నారు. పేదల ఇళ ్లకోసం అవసరమైతే ఎకరాకు రూ.5 కోట్లయినా ఖర్చుచేసి భూమిని కొంటామని సీఎం చంద్రశేఖరరావు ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఖజానాపై భారం లేకుండానే ఎక్కువ మందికి గృహ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం పీపీపీ విధానానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.