గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి
దసరాకు సరదాగా గడిపేందుకు అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చిన ఆరేళ్ల చిన్నారిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలితీసుకుంది. తాతయ్యతో కలిసి తినుబండారాలు కొనుక్కునేందుకు దుకాణానికి వచ్చి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌లో సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది.
ఆదిలాబాద్ , చిగురుమామిడి (హుస్నాబాద్): హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల నిర్మల, శంకర్ దంపతుల ఏకైక కూతురు శ్రీచందన(6) సోమవారం సాయంత్రం దసరా పండుగ నిమిత్తం చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్‌లోని అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చింది. చిన్నారి తాతయ్య పందిపెల్లి కనుకయ్యతో కలిసి హుస్నాబాద్–కరీంనగర్ రహదారికి అవతలివైపున ఉన్న కిరాణం దుకాణానికి తినుబండరాలు కొనుక్కునేందుకు వెళ్లి...తిరిగి తాతయ్యతో కలిసి రహదారి దాటుతోంది. ఇంతలోనే కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో శ్రీచందన అక్కడికక్కడే మృతిచెందింది. తలపై నుంచి బస్‌టైర్ వెళ్లడంతో తలపగిలి మెదడు బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు నిర్మల, శంకర్‌తోపాటు బంధువులు చేరుకుని రహదారిపై ఆందోళనకు దిగారు.
మూడు గంటలపాటు ఆందోళన...
శ్రీచందన మృతి విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు బంధువులతో కలిసి మూడు గంటలపాటు ఆందోళనకు దిగారు. హుస్నాబాద్–కరీంనగర్ ప్రధాన రహదారిపై చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని సర్దిచెప్పినా ససేమీరా అనకుండా రోడ్డుపై బైఠాయించారు. ఆర్టీసీ బస్‌లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రావాల్సిందేనని పట్టుబట్టారు. డీఎం ఆందుబాటులో లేడని చెప్పినా వినిపించుకోలేదు. బాధిత కుటుంబసభ్యులు ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు ఇవ్వలేదని ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉండగా ఆందోళన కొనసాగుతోంది. కాగా తిమ్మాపూర్, గన్నేరువరం ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, బిల్లా కోటేశ్వర్‌రావులు వచ్చి బందోబస్తు చర్యలు తీసుకున్నారు.