22న ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ | SMC Election Notification Will Be Released On Nov 22 | Sakshi
Sakshi News home page

22న ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌

Published Thu, Nov 21 2019 11:37 AM | Last Updated on Thu, Nov 21 2019 11:37 AM

SMC Election Notification Will Be Released On Nov 22 - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఆసిఫాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ)ల ఎన్నికలకు నగారా మోగింది. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే విధివిధానాలను పాఠశాలల హెచ్‌ఎంలకు తెలియజేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. కుమురం భీం జిల్లాలో మొత్తం 1242 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 902, ప్రాథమికోన్నత 177, ఉన్నత పాఠశాలలు 152 ఉన్నాయి. వీటిలో 87,176 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 

30న ఎన్నికలు..
ఈనెల 30న ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రేపే నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఇందే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్‌ తుది జాబితాను ప్రకటిస్తారు. 25న సాయం కాలం 4గంటల వరకూ ఈ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 26న ఉదయం 11 గంటలకు తుది జాబితా విడుదల చేస్తారు. విద్యార్థుల తల్లిగాని, తండ్రి లేక సంరక్షకులలో ఒకరికే ఓటు హక్కు ఉంటుంది. ఓటర్లలో 50 శాతం హాజరుకాకపోతే కోరం లేనట్లే. ముందగా సభ్యులను చేతులెత్తే పద్ధతిన లేక మూజువాని ఓటుతో, తప్పని పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నిక నిర్వహిస్తారు. 2016లో జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ నిర్వహించ లేదు. గతంలో ఓసారి ఆరు నెలల కోసం, మరోసారి నెలల కోసం ఎస్‌ఎంసీల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడగించింది. 30న మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎన్నిక, 1:30 గంటలకు నూతన సభ్యులను ఎన్నుకుంటారు. అదే రోజు చైర్మన్, వైస్‌చైర్మన్‌ను నియమించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 

సభ్యుల ఎన్నిక ఇలా..
ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉంటారు. ఇందులో ఒకరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి పిల్లల, అనాథ, ఎస్సీ, ఎస్టీ, వలసల వీధి బాలల ప్రత్యేక అవసరాల పిల్లల, హెచ్‌ఐవీ బారిన పడ్డ పిలల తల్లిదండ్రుల్లో ఒకరిని ఎన్నుకోవాలి. మరొకరు బలహీన వర్గాలకు చెందిన పిల్లల(బీసీ, మైనార్టీ, వార్షిక ఆదాయం రూ.60 వేలు మించని ఓసీ తల్లిదండ్రుల పిల్లల) తల్లిదండ్రులను ఎన్నుకోవాలి. మూడో వ్యక్తిని ఎవరిని అయినా ఎన్నుకోవచ్చు. ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులుంటే తరగతికి ముగ్గురు చొప్పున 15 మందిని, ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలల్లో 7వ తరగతి వరకూ ఉంటే 21 మందిని, 8వ తరగతి వరకూ ఉంటే 24 మంది సభ్యులను, ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల తల్లిదండ్రుల్లో 9 మందిని సభ్యులుగా ఎన్నుకోవాలి.

కన్వీనర్‌ ప్రధానోపాధ్యాయులే..
ఎస్‌ఎంసీలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలే కన్వీనర్‌గా ఉంటారు. మరో సీనియర్‌ ఉపాధ్యాయులు, వార్డు మెంబరు/కౌన్సిలర్, ఏఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, అంగన్‌వాడీ కార్యకర్త, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్నికైన సభ్యులతో పాటు ఈ ఆరుగురు, పదవీ విరమణ పొందిన సభ్యులు, ఇద్దరు కోఅప్షన్‌ సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎన్నికైన 15 మందితో పాటు ఆరుగురు సభ్యులు, ఇద్దరు కోఅప్షన్‌ సభ్యులతో మొత్తం 23 మంది ఉంటారు. 7వ తరగతి వరకూ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 29 మంది, 8వ తరగతి వరకూ ఉంటే 32 మంది, ఉన్నతపాఠశాలల్లో 17 మంది సభ్యులు ఉంటారు. ఆయా పాఠశాలల్లో విద్యావేత్త, పాఠశాల అభివృద్ధికి సహకరించే దాతలను ఎస్‌ఎంసీ సభ్యులుగా ఎన్నుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి లేదా విద్యార్థుల్లో ఇద్దరిని ఎన్నుకోవచ్చు. సర్పంచు, మున్సిపల్‌ చైర్మన్‌ సమావేశాలకు హాజరుకావచ్చు.

పాఠశాలల అభివృద్ధిలో కీలకం..
ఎస్‌ఎంసీలు విద్యాశాఖకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వారధిగా పనిచేయాలి. కీలకమైన ఈ ఎస్‌ఎంసీ కమిటీలు అనేక పాఠశాలల్లో ఇప్పటి వరకూ నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సమస్యలు తిష్టవేశాయి. చాలా చోట్ల ఎస్‌ఎంసీలు పట్టించుకోకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఉపాధ్యాయులు, తరగతి గదుల నిర్వహణతో పాటు, వారి సమయపాలన, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, ఇతర అంశాలపై ఆరా తీయాల్సిన కమిటీ సభ్యులు అసలు పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. చాలా మంది చైర్మన్లుకు వారి బాధ్యతలు ఏమిటో కూడా పూర్తిగా తెలియకపోవడం విశేషం. జిల్లాలోని అనేక పాఠశాలల హెచ్‌ఎంలు వారికి అనుకూలంగా ఉండే విద్యార్థుల తల్లిదండ్రులను ఎస్‌ఎంసీ చైర్మన్లుగా నియమించుకున్నారనే ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. దీంతో సదరు ఉపాధ్యాయుల పనితీరుపై ప్రశ్నించే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి నిర్వహించే ఎస్‌ఎంసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement