ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
సాక్షి, ఆదిలాబాద్ : ప్రభుత్వ కళాశాలల్లో రెగ్యులర్ లెక్చరర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత కొన్నేళ్లుగా జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ కాకపోవడంతో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో నాణ్యమైన బోధన లేక కొంతమేర విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఏటా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరగకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
జిల్లాలోని 13 ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 13 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారంటే ఇంటర్ విద్య పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. అంతేకాకుండా ఒక్కరు కూడా లైబ్రేరియన్, పీడీ లేరు. ఈ పోస్టుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. కనీసం కాంట్రాక్ట్ పద్ధతిన కూడా నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 13 మంది రెగ్యులర్, 138 మంది కాంట్రాక్ట్, 59 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. 2012 నుంచి జూనియర్ లెక్చరర్ల పోస్టులు భర్తీ కావడం లేదు. 2014లో ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేసే ఉద్యోగులకు పీజీ ఉన్నవారికి 10 శాతం కోట కింద పదోన్నతుల ద్వారా కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. దాదాపు ఏడేళ్లుగా జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ లేకపోవడంతో సర్కారు కళాశాలల్లో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్య అందడం లేదని తెలుస్తోంది.
దీని ప్రభావం ఇంటర్ ఫలితాలపై పడుతోంది. అయితే జిల్లాలో ఆదిలాబాద్, బేలలో మరాఠీ బోధన, మిగతా కళాశాలల్లో తెలుగు మీడియం తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలల బాట పడుతున్నారు. గతేడాది ఆంగ్ల మాధ్య మం బోధించాలని ఇంటర్‌బోర్డు సూచించినా రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో తెలుగు మీడియంలోనే చదువులు సాగుతున్నాయి.
కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే చదువులు..
కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతో కొన్ని కళాశాలల్లో అంతంత మాత్రంగానే చదువులు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పరీక్షల సమయంలో కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షల్లో విద్యార్థులకు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే వేటు పడుతుందనే ఉద్దేశంతో దగ్గరుండి మరీ చీటీలు అందిస్తున్నారు.
కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో 95 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తుండగా, ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం 30శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత రావడం లేదు. ఇంటర్‌లో అధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. డిగ్రీలో 25 నుంచి 30 శాతం కూడా ఫలితాలు రావడం లేదంటే ఇంటర్‌లో పరిస్థితి ఏందో అందరికీ తెలిసిందే.
జాడలేని పీడీ, లైబ్రేరియన్ పోస్టులు
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఒక్కరు కూడా ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్ లేరు. వ్యాయామ లెక్చరర్లు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవ్వడంతోపాటు శారీరక ధృడత్వాన్ని పొందలేకపోతున్నారు. విద్యాబోధన చేసేందుకు కనీసం కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నా పీడీలు మాత్రం లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అలాగే లైబ్రేరియన్ లేకపోవడంతో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. లైబ్రేరిలో ఉన్న పుస్తకాలు కూడా మూలన మూలుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment