జనం గుండెల్లో.. హిస్‌స్‌..  | Snakes attack in the City | Sakshi
Sakshi News home page

జనం గుండెల్లో.. హిస్‌స్‌.. 

Published Mon, Jul 22 2019 2:22 AM | Last Updated on Mon, Jul 22 2019 4:28 AM

Snakes attack in the City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చీమలు పెట్టన పుట్టలో పాములు దూరినట్లు... పాముల పుట్టల ప్రాంతాల్లో జనావాసాలు వెలుస్తున్నాయి. నగరంలో జనాభా పెరగడంతో శివారు ప్రాంతాలు కూడా సిటీలో కలిసిపోతున్నాయి. శివారు ప్రాంతాలను ఆక్రమించి చెట్టూపుట్టా అంటూ లేకుండా వెంచర్లు, నిర్మాణాలు చేపడుతుండటంతో పాములు ఇళ్ల మధ్యకు వచ్చి బుస కొడుతున్నాయి. దీంతో పాము కాటు బాధితులు పెరిగిపోతున్నారు. చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కేవలం నెలన్నర రోజుల్లోనే ఉస్మానియాలో 92 కేసులు, గాంధీలో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు మరో యాభై మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పాము కాటు కేసులు పెరగడంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని వైద్యులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.  

పాముల పుట్టల్లోకి జనావాసాలు... 
నగరం శివారు ప్రాంతాలకు కూడా విస్తరించింది. రోజుకో కొత్త వెంచర్‌ ఏర్పడటంతో పాటు నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సిటీకి దూరంగా ఉన్న కాలనీల్లో వీధిలైట్లు లేవు. ఉన్నవాటిలో చాలా వెలగడం లేదు. చాలా చోట్ల ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉండటం, అవి చెట్ల పొదలు, రాళ్లు, పుట్టలతో నిండిపోతున్నాయి. నిర్మాణ సమయంలో పిల్లర్ల కోసం గుంతలు తవ్వాల్సి వచ్చినప్పుడు పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. అక్కడ పని చేసేందుకు వచ్చిన కార్మికులు బయట నిద్రించేటప్పుడో, రాత్రిపూట మలమూత్ర విసర్జనకు వెళ్లినప్పుడో కాటేస్తున్నాయి. 

వైద్యులు అందుబాటులో లేక... 
నగరం నాలుగు వైపులా 40 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను అంబులెన్స్‌లో తీసుకుని సిటీ రోడ్లపై రద్దీని దాటుకుని ఆస్పత్రులకు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో చాలా మంది మార్గమధ్యలోనే మృత్యువాతపడుతున్నారు. బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, మలక్‌పేట్‌లో ఏరియా ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అయితే వాటిలో వైద్య పరికరాలు, మందులు, తక్షణ సేవలు అందించే వైద్యులు లేకపోవడంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. నల్లగొండ, భువనగిరి, మేడ్చల్, మహబూబ్‌నగర్, వికారాబాద్‌ జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఆయా జిల్లాల బాధితులు కూడా ఇక్కడికే వస్తున్నారు. 

ఆందోళన వద్దు.. 
పాముకాటుకు గురైన వెంటనే కాటు వేసిన చోటుకు పైభాగాన తాడుతో గట్టిగా కట్టాలి. వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. 10 నిమిషాలకోసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. పాముకాటుకు గురైన వారిలో అధిక శాతం మంది ఆందోళనకు గురై రక్త ప్రసరణ పెరిగి విషం శరీరమంతా వ్యాపించి చనిపోతున్నారు. ఆ వ్యక్తికి పక్కనే ఉండి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం.  
– డాక్టర్‌ శ్రవణ్‌కుమార్, జనరల్‌ ఫిజీషియన్, ఉస్మానియా ఆస్పత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement