‘కేసీఆర్ తుగ్లక్‌లా చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ తుగ్లక్ పనులు చేసి చాలా గొప్పగా చేశానంటూ చెప్పుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గవర్నర్‌తో రాజకీయ ప్రసంగం చదివించారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా వద్ద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు మాట్లాడారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏం మాట్లాడారంటే..
..‘తెలంగాణ ఏర్పడిన తర్వాత గవర్నర్‌ది నాలుగో ప్రసంగం. సాధారణంగా గవర్నర్ ప్రభుత్వ కేబినెట్ ఏది రాసిస్తే అదే చదువుతారు. నేటి ప్రసంగంలో ప్రధాన అంశాలు మాత్రం ఇందులో లేవు. గతంలో ప్రకటించిన పథకాలపై నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. గవర్నర్ చేత పలు చోట్ల అబద్ధాలు చెప్పించారు. పవర్ సప్లయ్ విషయంలో కాంగ్రెస్ హయాంలో పూర్తయినవి తప్ప వీళ్లు మొదలుపెట్టిన ప్రాజెక్టులతో ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. అందించలేదు. వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకొచ్చే పనులు కూడా గత ప్రభుత్వమే మొదలుపెట్టింది. ఏదో అద్భుతం చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు.
పరిశ్రమలు వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పించారు. తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెబ్ సైట్ ఇచ్చిన నివేదిక 2017 తెలిపింది. 31 జిల్లాల గురించి గొప్ప చేసినట్లు చెబుతున్నారు. అన్ని తుగ్లక్ పనులు చేసి గొప్ప పనులని కేసీఆర్ అంటున్నారు. జిల్లాల విభజనలో ప్రజల మనోభవాలు పట్టించుకోలేదు. జీడీపీ గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పారు.. దానిపై అనుమానం ఉంది. రబీలో తెలంగాణ రైతు బ్రహ్మాండంగా చేశారని కేసీఆర్ అంటున్నారు. కానీ, ఏది నిజమో రైతులకు తెలుసు. పంటపండింది తక్కువ చెప్పుకుంటుంది ఎక్కువ. వాస్తవానికి తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ముస్లింలు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 12శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదు’ .
జానారెడ్డి ఏం మాట్లాడారంటే..
‘ప్రభుత్వ విధివిధానాలను వివరించే విషయంలో ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు.. మూడెకరాల భూమి, 12శాతం మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ స్పీచ్ చాలా బాధా కలిగించింది. డబుల్ బెడ్‌రూం, మూడు ఎకరాల భూమిపై ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేం కూడా కొత్త ప్రభుత్వం అని సహకరించాం. వారు చేసిన తప్పిదాన్ని వారికి తెలియజేసేందుకే మేం వాకౌట్ చేశాం’ అని అన్నారు.