► శోభన్‌ను వెంటాడిన ఇన్‌ఫార్మర్లు
► ఆత్మవిశ్వాసమే ముంచింది..
మంచిర్యాల సిటీ : ఆత్మవిశ్వాసమే జిల్లా మావోయిస్టుల కొంప ముంచిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ జిల్లా సభ్యుడు, యాక్షన్ టీం కమాండ్ అత్రం శోభన్ అలియాస్ చార్లెస్ చనిపోవడమే అందుకు నిదర్శనం. జిల్లాలోని గిరిజన గూడెంలలో శోభన్‌కు పటి ష్టమైన పట్టు ఉండటంతో అతని సమాచారం ఎక్కడా బయటకు పొక్కలేదు. చిన్ననాటి నుం చి తిర్యాణి మండలంలో పెరగడం, గిరిజనులకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో అతని సమాచారం తెలియరాలేదు. 20 నెలలుగా జిల్లాలోని అడవుల్లో అణువణువూ గాలించినా బలగాలకు చిక్కలేదు. దీంతో పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్న విషయాన్ని పసిగట్టిన బలగాలు అందుకు తగిన సమాచారాన్ని సేకరించి తుదముట్టించారు.
ప్రత్యేక నిఘా..
ప్రత్యేక పోలీస్ బలగాలు శోభన్ రాకపోకలపై రెండు రాష్ట్రాల్లో నిఘా పెంచాయి. జిల్లాకు ఎప్పుడు వస్తున్నాడు.. జిల్లా దాటి ఎక్కడికి వెళ్తున్నాడు.. ప్రాణహితకు ఇవతలి వైపున శోభన్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి.. అక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారు.. వాటిపై నిఘా పెంచి అందుకు అవసరమైన మానవ సంబంధాలను బలగాలు పెంచుకున్నాయి. అందుకు తగిన విధంగానే ప్రాణహిత అవతలివైపున పెంచుకున్న సంబంధాలు సహకరించాయి. దీంతో శోభన్ స్థావరాలపై కన్నేసి ఉంచాయి. గాలింపు చేపట్టిన బలగాలకు తెల్లవారుజామున తారసపడ్డాడు. జరిపిన ఎదురుకాల్పుల్లో శోభన్ మృతి చెందాడు. ప్రత్యేకంగా శోభన్ కోసం బలగాలు గాలింపు చేపట్టినా అతనే ఆదివారం నాటి ఎదురుకాల్పులకు ఎదురవుతాడని ఊహించలేదు. కాల్పులు ముగిసిన అనంతరం శోభన్ సామగ్రి పరిశీలించిన తరువాతనే మృతుడు ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు అని తేలింది.
వరుస సంఘటనలు..
ఈనెల 9న గడ్చిరోలి జిల్లా ధనోర తాలుగా పరిధిలో ఇన్‌ఫార్మర్ నెపంతో ఒకరిని మా వోలు కాల్పిచంపారు. గత నెలలో ముగ్గురిని ఇదే నెపంతో కాల్చి చంపారు. ఈ హత్యలకు శోభన్ భాగస్వామ్యం ఉందని అక్కడి పోలీసు లు సైతం ధ్రువీకరించారు. వరుస సంఘటనలతో అక్కడి ప్రజలు భయానికి లోనుకావడం, పోలీసులు వైఫల్యం చెందారనే నిందలు రావడంతో హత్యలకు ప్రధాన కారకులు ఎవరనేది పసిగ ట్టాయి. దీంతో అక్కడి బలగాలు అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. పటిష్టమైన ఇన్‌ఫార్మర్ వ్యవస్థ పెరిగిపోవడంతో పాటు వరుస సంఘటనలు తోడు కావడంతో అక్కడి పోలీసులు గట్టి నిఘా పెంచాయి. ఎట్టకేలకు గడ్చిరోలి ప్రాంతంలో నెల రోజులుగా పోలీసులకు ఇబ్బందికరంగా తయారైన శోభన్ అక్కడి పోలీసులకే చిక్కడం, ఇక్కడి పోలీసులకు చిక్కకపోవడం చర్చనీయాంశమైంది.
శోభన్‌కు సహాయకుడిగా దినేశ్..
గడ్చిరోలి జిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన యాక్షన్ టీం సభ్యుడు దినేశ్ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నకు కొంత కాలంపాటు గన్‌మన్‌గా పనిచేశాడు. చంద్రన్నకు నమ్మినబంటుగా ఉండి అతని పనులను చేసిపెట్టేవాడు. గడ్చిరోలి జిల్లా ప్రాంతానికి చెందిన దినేశ్ మావోయిస్టులో చేరిన అనంతరం శిక్షణ పొంది గన్‌మన్‌గా నియామకమయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలో యాక్షన్ టీంకు సభ్యులు అవసరం కావడంతో కమాండర్ శోభన్‌కు సహాయకుడిగా నియమించడంతో గన్‌మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
యాక్షన్ టీం కథ ముగిసింది..
జిల్లా యాక్షన్ టీం కమాండర్ అత్రం శోభన్‌తోపాటు సభ్యులు దినేశ్, ముఖేశ్ గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించడంతో యాక్షన్ టీం కథ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2014, అక్టోబర్ 30న తిర్యాణి మండలం కేరిగూడలో గిరిజన యువకుడు బల్లార్షాను హత్య చేయడంతో యాక్షన్ టీం మరోసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి తూర్పు ప్రాంతంలోని అత్యధిక మండలాల్లో పర్యటిస్తూ ఇన్‌ఫార్మర్‌లను హెచ్చరిస్తూ, వాహనాలను తగులబెడుతూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. 20 నెలలుగా పోలీస్ బలగాలకు సవాల్ విసురుతూ కంటిమీద కునుకులేకుండా చేసింది యాక్షన్ టీం. చిట్ట చివరకు పక్క రాష్ట్రంలో చిక్కి ఇక్కడి పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం.
పక్క రాష్ట్రంలో.. పక్కా సమాచారంతో..
Published Tue, Jun 21 2016 8:32 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement