ఒకప్పుడు రెగ్యులర్ హాస్టల్‌తో పాటు వేరే హాస్టళ్లకు ఇన్‌చార్జిగా పని చేయడానికి పోటీ పడిన వార్డెన్లు.. ఇప్పుడు ఇన్‌చార్జి బాధ్యతలు తమకొద్దంటూ వరుసకట్టి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పక్క హాస్టళ్లకు ఇన్‌చార్జి బాధ్యతలను దక్కించుకోవడానికి పావులు కదిపిన వార్డెన్లే.. ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలంటూ అధికారులను కోరుతున్నారు. ఇటీవలి సన్నబియ్యం తరలింపు వ్యవహారంతోపాటు, అదనపు బాధ్యతల భారం కారణంగా ఇన్‌చార్జిగా కొనసాగలేమంటున్నారు.
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఇటీవల సన్నబియ్యం తరలింపు వ్యవహారం బయటపడడంతో ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కొందరు హాస్టళ్ల వార్డెన్‌లు ప్రయత్నాలు చేయడం ఆయా సంక్షేమశాఖల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానంగా పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు ఇన్‌చార్జిలుగా తాము పని చేయలేమని స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కో వార్డెన్‌కు రెండు నుంచి మూడు వరకు హాస్టళ్ల బాధ్యతలు ఉండటం మూలంగా ఏ హాస్టల్‌కు న్యాయం చేయలేకపోతున్నామని మరికొంత మంది వార్డెన్‌లు అధికారుల ముందు వాపోతున్నారు.
జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి మొత్తం 82 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 32 ఉండగా, 10 పోస్టుమెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. బీసీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 19 ఉండగా, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 13 ఉన్నాయి. అదే విధంగా ఎస్టీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు 4, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు 4 ఉన్నాయి. మొత్తం 82 హాస్టళ్లలో బీసీ –11, ఎస్సీ– 14, ఎస్టీ–2 చొప్పున మొత్తం కలిపి 27 హాస్టళ్లకు వార్డెన్‌లు లేక గత కొన్నేళ్లుగా ఇన్‌చార్జిలతో కొనసాగిస్తున్నారు.
అత్యధికంగా ఎస్సీ, బీసీ హాస్టళ్లే ఇన్‌చార్జిలతో నడుస్తున్నాయి. అయితే రెగ్యులర్ హాస్టల్‌తో పాటు ఖాళీగా ఉన్న వేరే హాస్టళ్లకు ఇన్‌చార్జిలుగా పని చేయడానికి పోటీపడి.. ఒక్కొక్కరు రెండు, మూడు హాస్టళ్లకు పని చేశారు. ఇటీవల హాస్టల్ సన్నబియ్యం తరలింపు వ్యవహారం బయటపడడం.. అది కూడా వార్డెన్‌లు ఇన్‌చార్జిగా పని చేస్తున్న హాస్టళ్లే కావడం విశేషం. దీంతో మిగతా వార్డెన్‌లకు గుబులు పట్టుకుంది. ఇన్‌చార్జులుగా పని చేసి బుక్కయ్యే దానికంటే రెగ్యులర్ హాస్టల్‌కు పని చేయడమే మేలని భావించి ఇన్‌చార్జి బాధ్యతలను తొలగించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
భారం కూడా కారణమే..
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 27 హాస్టళ్లకు వార్డెన్‌లు లేక చాలాకాలంగా ఇన్‌చార్జిలతో కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు, నుంచి మూడు హాస్టళ్ల అదనపు బాధ్యతలు ఉండటం మూలంగా కొంతమంది వార్డెన్‌లు ఏ హాస్టల్‌కు కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఒకే రోజు రెండు, మూడు హాస్టళ్లకు ఉదయాన్నే వెళ్లి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించడం సాధ్యం కావడం లేదు. దీంతో హాస్టళ్ల పాలన గాడితప్పుతోంది. ఇటు ప్రభుత్వం కూడా వార్డెన్ ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కూడా ఉన్న వార్డెన్‌లపైనే భారం పడుతోంది. అన్ని శాఖల్లో పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్‌లు లేక ప్రీ మెట్రిక్ హాస్టళ్ల రెగ్యులర్ వార్డెన్‌లే ఇన్‌చార్జిలుగా పని చేస్తున్నారు.
హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు
ఎస్సీ 14, బీసీ 11, ఎస్టీ 02, మొత్తం 27
Comments
Please login to add a commentAdd a comment