ఎమ్మెల్యే తలారికి సమస్యలను వివరిస్తున్న విద్యార్థులు
సాక్షి, దేవరపల్లి(పశ్చిమగోదావరి) : ‘ఇది మంచినీరా..? ఇవి పిల్లలు తాగాలా?’ అంటూ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హాస్టల్ అధికారులపై మండిపడ్డారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం సాంఘిక సంక్షేమశాఖ బాలుర ప్రత్యేక వసతి గృహాన్ని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు వసతి గృహాన్ని పరిశీలించి నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న గదులు, పురుగులు, మట్టి, నాచుతో నిండి మూతలేని మంచినీటి ట్యాంకును పరిశీలించిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగులు పట్టిన మంచినీటిని విద్యార్థులకు ఎందుకు సరఫరా చేస్తున్నారని సిబ్బందిని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నిలదీశారు.
చుట్టూ క్వారీలు ఉండడం వల్ల దుమ్ము నీటి తొట్టెలో పడుతుందని, తొట్టెకు మూత లేకపోవడం వల్ల కలుషితమవుతుందని విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించారు. పురుగులు, అన్నం మెతుకులు గల మంచినీటిని సరఫరా చేస్తున్నారని, ఈ నీటితోనే వంటలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. అడిగితే సిబ్బంది బూతులు తిడుతున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. వసతిగృహంలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దుర్భాషలాడుతూ చిత్రహింసలు పెడుతున్నట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ దీపాలు సరిగా వెలగడం లేదని, మంచినీరులేక ఇబ్బంది పడుతున్నట్టు విద్యార్థులు వివరించారు. ఫ్యాన్లు లేక ఉక్కపోతలో ఉంటున్నట్టు తెలిపారు. డైనింగ్ హాల్ లేక కింద కూర్చుని భోజనం చేస్తున్నట్టు విద్యార్థులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు వివరించారు. ప్రతీరోజు పప్పు అన్నం తినలేకపోతున్నామని. 50 మంది విద్యార్థులకు రెండున్నర లీటర్ల పెరుగు వేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్న భోజనంతో పెరుగు వేయడం లేదన్నారు. పరిసరాలు శుభ్రంగాలేక చదవలేకపోతున్నట్టు విద్యార్థులు ఎమ్మెల్యే వెంకట్రావుకు వివరించారు.
విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదని, రాత్రి సమయంలో కరెంట్ సరిగా ఉండడంలేదని విద్యార్థులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులకు తక్షణం మినరల్ వాటర్ సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మినరల్ వాటర్ సరఫరా చేయకుండా పురుగులు పట్టిని మంచినీటిని సరఫరా చేస్తున్నారని సంక్షమాధికారి సత్యనారాయణను ఫోన్‌లో ప్రశ్నించారు. ఇంటి వద్ద మీ పిల్లలకు ఇలాంటి మంచినీరు ఇస్తారా? అని ఆయన నిలదీశారు. విద్యార్థుల సమస్యలను జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన తెలిపారు. వసతిగృహాల సంక్షేమాధికారులు స్థానికంగా ఉండాలన్నారు.. వసతిగృహాల సంక్షేమాధికారులు స్థానికంగా ఉండకపోవడం వల్ల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. గౌరీపట్నం వసతిగృహం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకుంటున్న వసతిగృహాలు ఈ విధంగా ఉండడం దారుణమని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని అన్ని వసతిగృహాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, విద్యార్థులపై సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వసతిగృహాల్లో మినరల్ వాటర్ వినియోగించాలని ఆయన అన్నారు. గౌరీపట్నం వసతి గృహం సంక్షేమాధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించడం వల్ల అందుబాటులో లేరు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తికొండ అచ్యుతరావు, పార్టీ నాయకులు కొటారు వెంకటసుబ్బారావు. ఆండ్రు సత్తిరాజు, కుండా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment