విందుపేరుతో అశ్లీల నృత్యాలు
గుట్టుచప్పుడు కాకుండా రిసార్టుల్లో రేవ్‌పార్టీలు
జిల్లా శివారులో అసాంఘిక కార్యకలాపాలు
షాద్‌నగర్ రూరల్ : విందు పేరిట నిర్వహిస్తున్న రేవ్ పార్టీలకుఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ఈ పార్టీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రిసార్టులపై పోలీసులు ని ఘా పెట్టినందున రేవ్ పార్టీలకు షాద్‌నగర్ అనువైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు సమాచారం.
2014 ఫిబ్రవరిలో ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ శివారులోని అగ్రిగోల్డ్ రిసార్టులో హైదరాబాద్, కడప, కర్నూలు, రాయిచూర్‌కు చెందిన 24మంది యువకులు, ముగ్గురు మహిళా డాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేస్తూ, పేకాట ఆడుతూ రేవ్ పార్టీ నిర్వహించారు. దీంతో అప్పటి డీఎస్పీ ద్రోణాచార్యులు సిబ్బందితో అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పది వాహనాలను సీజ్ చేయడంతోపాటు *21లక్షలను స్వాధీనం చేసుకుని ముగ్గురు అమ్మాయిలను స్టేట్‌హోంకు తరలించారు.
అదే రిసార్టులో..
ఇదే రిసార్టులో శనివారం అర్ధరాత్రి రేవ్‌పార్టీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్‌సింగెనెవారె 40 మంది యువకులను, ఎనిమిది మంది యువతులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతకాలంగా మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రా, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు ఔరంగాబాద్, హైదరాబాద్‌లోని ఆటోనగర్‌లో సుపీరియా క్రాఫ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి వారిలో 40మంది యువకులు విందు చేసుకునేందుకుగాను ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ శివారులోని అగ్రిగోల్డ్ వెంచర్‌కు వచ్చా రు. వారితోపాటు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ముగ్గురు, ఆంధ్రాకు చెందిన ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకరు, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువతులు అక్కడికి చేరుకున్నారు. విందు పేరుతో యువతులను తీసుకొచ్చి అశ్లీలనృత్యాలు చేస్తూ రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్‌సింగెనెవారె, ఎస్‌ఐలు పోచయ్య, శ్రీని వాస్ హుటాహుటిన అక్కడికి చేరుకుని 40మంది యువకులతోపాటు అశ్లీలనృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులను అరెస్టు చేశారు. అనంతరం షాద్‌నగర్ పట్టణ సీఐ శంకరయ్యకు నిందుతులను అప్పగించారు. విందు పేరుతో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.
కాగా, రేవ్ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించే ఆస్కారముందని, ఈ రిసార్టులను సీజ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతంలోని ఆరు రిసార్టుల్లో ఇలాంటి పార్టీలు జరుగుతూనే ఉంటాయి. కొందరు సినీప్రముఖులు సైతం తమ ఫాంహౌస్‌లను ఇక్కడే నిర్మించుకోవడం గమనార్హం.