కరోనా మృతులను అంత్యక్రియలకు తరలించే అంబులెన్స్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
ఈ పదిమంది కలిస్తే మానవత్వం పరిమళిస్తుంది. కరోనా వేళ కారుణ్యమూర్తులై బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఏ తల్లి బిడ్డలో తెలియదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు రెక్కలు కట్టుకొని వాలిపోతారు. అన్నీ తామై ఆదుకుంటారు. ‘కోవిడ్ వారియర్సై’ కదిలి వస్తున్నారు. అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లడం.. దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అంత్యక్రియలు నిర్వహించడం వంటివి చేపడుతున్నారు. ‘అంతిమసంస్కారం’ చాటుకుంటున్నారు. ‘ఫీడ్‌దనీడ్’గొడుగు కింద సామాజికసేవకు పూనుకున్నారు.
కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే చుట్టుపక్కల వాళ్లు భయపడిపోతున్నారు. సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కరోనా కారణంగా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు కూడా ముందుకురాని స్థితిలో ఆ 10 మంది అన్నీ తామే అయి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సాయితేజ, శ్రీనివాస్ బెల్లం, ప్రశాంత్ మామిండ్ల, వినయ్ వంగాల, రమణ్‌జిత్ సింగ్, సురేంద్ర, ప్రదీప్, అనుమోత్, విద్యాసాగర్, అంకిత్‌రాజ్ స్నేహితులు. అందరూ సాఫ్ట్‌వేర్ నిపుణులే. ‘‘వారం క్రితం మా స్నేహితుడు మాన్‌సింగ్ తల్లి కోవిడ్‌తో చనిపోయారు. కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్నారు.
మేమే బాధ్యత తీసుకున్నాం. ఆసుపత్రి నుంచి ఈఎస్‌ఐ శ్మశానం వరకు అంబులెన్స్‌కు రూ.25,000, అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లేందుకు మరో రూ.20,000 ఖర్చయ్యాయి. మేమందరం కలిసి ఖర్చులు పంచుకున్నాం. కానీ పేద, మధ్యతరగతి ప్రజలు అంత ఖర్చును భరించగలరా... పైగా వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చేదెవరు.. అందుకే అలాంటివారికి ఉచితంగా అన్నీ దగ్గ రుండి చేయాలని నిర్ణయించుకున్నాం’’అని చెప్పారు సాయితేజ. అంత్యక్రియల కోసం ఎవరైనా సహాయం కోరితే ఫీడ్ ద నీడ్ సంస్థ నుంచి లాస్ట్ రైడ్ వాహనం వస్తుంది. స్వచ్ఛందసేవకులు సైతం బాడీ బ్యాగు, పీపీఈ కిట్లు, సోడియం హైపోక్లోరైడ్, శానిటైజర్ తీసుకొని వస్తారు. వాళ్లే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. వారి అస్థికలను సైతం మేమే నదీజలాల్లో కలిపి వస్తున్నాం’ అని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలోనూ వీరు 50 వేల మంది అన్నా ర్తుల ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నారు.
అన్నీ తామై....
► బీహెచ్‌ఈఎల్‌కు చెందిన ఒక వ్యక్తి కోవిడ్‌తో చనిపోతే అంత్యక్రియలు జరిపేందు కు కన్నకొడుకు భయపడ్డాడు. ఇరుగు పొరుగు సైతం వెనుకడుగు వేశారు. ఆ కుటుంబానికి ఫీడ్ ద నీడ్ వారియర్స్ అన్నీ తామై నిలిచారు.
► కొండాపూర్‌కు చెందిన ఓ వృద్ధుడు శుక్రవారం సోమాజిగూడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కోవిడ్‌తో కన్నుమూశాడు. కొడుకు, కూతురు అమెరికాలోనే ఉన్నారు. ఆయన భార్య 65 ఏళ్ల వయోధికురాలు. నిస్సహాయ స్థితిలో ఫీడ్ ద నీడ్‌ను సంప్రదించింది.
ఒక్క ఫోన్ చాలు
8499843545 ఈ నెంబర్‌తో ఫీడ్ ద నీడ్ కాల్‌సెంటర్ పని చేస్తుంది. 24 గంటలపాటు సహాయం అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment