జడలు విప్పిన మట్కా
- నిండా మునుగుతున్న నాపరాతి కార్మికులు
- షోలాపూర్ కేంద్రంగా మట్కా జూదం
- తెర వెనుక నుంచి ‘పెద్దల’ హస్తం
- తాండూరు మండలంలో రూ.లక్షల్లో బెట్టింగులు
- పోలీసులకు నెలకు రూ.60 వేల మామూళ్లు?
తాండూరు: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న మట్కా జూదం మళ్లీ జడలు విప్పింది. పేద, మధ్యతరగతి, నాపరాతి కార్మికులను ఆర్థికంగా చిదిమేస్తోంది. ‘పెద్దలహస్తం’తో మట్కా బెట్టింగులు ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి. నిత్యం రూ. లక్షల్లో బెట్టింగ్ వ్యవహారాలు సాగుతున్నాయి. మహారాష్ట్ర షోలాపూర్ కేంద్రంగా మట్కా బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
మండలంలోని గోపన్‌పల్లి, గౌతాపూర్ ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని మట్కా నిర్వాహకులు బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. క్షేత్రస్థాయిలో ఒకరిద్దరు ఖాకీలు వెన్నుదన్నుగా నిలుస్తుండంతోనే నిర్వాహకులు మళ్లీ మట్కా జూదానికి తెరలేపారని సమాచారం. మట్కా బెట్టింగుల్లో ఆరితేరిన ఓ పాత నేరస్తుడు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను సుమారు పది మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని బెట్టింగులు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
నాపరాతి కార్మికులే లక్ష్యంగా..
మండలంలో వందలాది నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్‌లు ఉన్నాయి. దీంతో నాపరాతి కార్మికులు లక్ష్యంగానే ఈ బెట్టింగులు జరుగుతున్నాయి. పదిమంది ఏజెంట్‌లు గనులు, పాలిషింగ్ యూనిట్ల వద్దకు వెళ్లి కార్మికుల నుంచి బెట్టింగ్ డబ్బులు వసూలు చేస్తూ చిట్టీలు రాసిస్తున్నారు. అమాయక కార్మికులు మట్కా బెట్టింగ్ వలలో చిక్కి నష్టపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపెన్ నంబర్‌కు, రాత్రి క్లోజింగ్ నంబర్‌కు మట్కా బెట్టింగులు జరుగుతున్నాయి. ఓపెన్, క్లోజింగ్ నంబర్లు కలిస్తే బెట్టింగ్ డబ్బులకు రెండింతలు ఏజెంట్లు చెల్లిస్తున్నట్టు సమాచారం. బెట్టింగ్ కట్టిన వారు సూచించిన నంబర్ వస్తే డబ్బులు వసూలు చేసిన ఏజెంట్‌లే సెల్‌ఫోన్ ద్వారా సదరు వ్యక్తులకు సమాచారం అందజేస్తున్నారు.
తర్వాత వారు వచ్చి డబ్బులు తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది. రోజుకు సుమారు రూ.1.5 లక్షల చొప్పున మట్కా బెట్టింగ్ లావాదేవీలు కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మట్కా ప్రధాన నిర్వాహకుడు ఓ పోలీసు అధికారికి నెలకు రూ.40వేలు, ఇద్దరు కిందిస్థాయి అధికారులకు రూ.10వేల చొప్పున మామూళ్లు అందజేస్తుండటంతోనే మట్కా బెట్టింగులు మళ్లీ మొదలయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెరవెనుక కొందరు ‘పెద్దల’ హస్తం ఉండటంతో సదరు అధికారులు బెట్టింగ్ వ్యవహారాల జోలికి వెళ్లడం లేదని సమాచారం. మట్కా మహమ్మారి తాండూరు పట్టణానికి సైతం పాకినట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే మట్కా బెట్టింగులకు బ్రేక్‌పడే అవకాశం ఉంది.
పోగొట్టుకుంటున్న డబ్బులే ఎక్కువ..
తెల్లవారేసరికి లక్షలు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది పేద, మధ్యతరగతికి చెందినవారు మట్కా జూదానికి అలవాటుపడ్డారు. నాపరాతి కార్మికులు మట్కా బెట్టింగులతో గెలుచుకునే సొమ్ముకన్నా ఎక్కువగా పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. మట్కా జూదంలో సింగిల్, డబుల్ నంబర్లు కలిస్తే సబ్ ఏజెంట్లు రూ.10కు రూ.100 చొప్పున చెల్లిస్తున్నట్టు సమాచారం.