
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డికి ఇద్దరు ఖాకీలు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఓ ఏసీపీ, హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు పరోక్షంగా ఈ హత్యకు సహకరించానే వార్తలు వినబడుతున్నాయి. వీరిలో ఓ అధికారి రాకేష్ ఇంటి సమీపంలోనే ఉంటారని సమాచారం. జయరామ్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలనేదానిపై ఆ పోలీసు అధికారి రాకేష్‌ను సలహా ఇచ్చారని సమాచారం. ఆయన సలహా మేరకే రాకేష్ మృతదేహాన్ని కారులో వేసుకుని వెళ్లి నందిగామ శివార్లలో యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని సమాచారం. మరోపక్క జయరామ్‌ను ఎలా ట్రాప్ చేయాలనే అంశంలో.. మరో పోలీసు అధికారి రాకేష్‌కు సలహా ఇచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎస్‌లో పని చేస్తున్న కె.మురళీధర్‌ను నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ అక్కడున్న ఎస్.శ్రీనివాసులును ప్రాధాన్యం లేని, లూప్ లైన్ పోస్టింగ్‌గా భావించే ప్రధాన కంట్రోల్ రూమ్‌కు మార్చారు. బి.అనురాధ, ఎం.రామారావు, ఎల్.రాములులను ఫలక్‌నుమ, భవానీనగర్, మంగళ్‌హాట్ ఠాణాలకు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించారు. అయితే ఈ బదిలీలకు కారణాలపై నగర పోలీసు కమిషనర్‌ను ‘సాక్షి’సంప్రదించగా.. కేవలం పాలనా పరమైన కారణాలతోనే ట్రాన్స్‌ఫర్స్ చేశామని, ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని అన్నారు. జయరామ్ హత్యలో పోలీసుల పాత్ర పైనా, ఆ కేసు హైదరాబాద్‌కు బదిలీ పైనా ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన పేర్కొన్నారు. కాగా, పోలీసుల పాత్రపై అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment