
‘నా బ్యాంకు ఖాతాలోని సొమ్మును పేటీఎం ద్వారా కాజేసిన వారిపై చర్యలు తీసుకోండి’అంటూ కొన్నాళ్ల క్రితం ఫిర్యాదు చేసిన ఓ బాధితుడు.. ‘అబ్బబ్బే.. చర్యలు వంటివి ఏమీ వద్దు’అని గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని వేడుకున్నాడు. ఈ మార్పునకు కారణం ఏమిటో తెలియాలంటే ఇది చదవాల్సిందే. వివరాలు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈయన బ్యాంకు ఖాతా నుంచి నెల రోజుల వ్యవధిలో వివిధ దఫాల్లో మొత్తం రూ.70 వేలు వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి.
ఈ విషయం గుర్తించిన ఆయన నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ పరిశీలించగా.. నగదు మొత్తం పలు దఫాల్లో వేర్వేరు ఖాతాలకు బదిలీ కావడాన్ని బట్టి ఇంటి దొంగల పాత్రను అనుమా నించారు.
ఇదే విషయాన్ని బాధితుడికి చెప్పి ఎవరిపైన అయినా అనుమానం ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి ఆస్కారం లేదంటూ చెప్పిన బాధితుడు అసలు నిందితుడిని పట్టుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. అనంతరం బ్యాంకు నుంచి వివరాలు పొందిన పోలీసులు ఆ డబ్బు మొత్తం పేటీఎం ద్వారా బదిలీ అయినట్లు గుర్తించారు. – సాక్షి, హైదరాబాద్
అవాక్కయిన తండ్రి..
పేటీఎం సంస్థకు లేఖ రాసి ఆయా లావాదేవీలకు పాల్పడిన ఫోన్ నంబర్ తెలుసుకున్నారు. దీని వివరాలు ఆరా తీయగా ఫిర్యాదుదారుడి కుమారుడికి చెందినదిగా తేలింది. తండ్రికి తెలియకుండా ఆయన డెబిట్‌కార్డును చేజిక్కించుకున్న ఆ సుపుత్రుడు దాన్ని తన పేటీఎం ఖాతాతో లింక్ చేసుకున్నాడు. ఆపై నెల రోజుల పాటు జల్సాలు చేస్తూ తండ్రి ఖాతాలోని రూ.70 వేలు ఖర్చు చేశాడు.
ఈ విషయాన్ని సదరు తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆయన అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. తన కుమారుడిని తాను మందలిస్తానని, విద్యార్థి అయిన అతడిపై చట్టపరంగా చర్యలు వద్దని, తన ఫిర్యాదు వెనక్కు తీసుకుంటున్నానని వేడుకున్నాడు. సానుకూలంగా స్పందించిన అధికారులు కుమారుడికి ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment