![soubhagya scheme guidelines issued](/styles/webp/s3/article_images/2017/10/25/bike.jpg.webp?itok=lSOcgCZI)
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో మోటార్ సైకిల్, ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్నా, 16–59 ఏళ్ల మధ్య వయసు గల కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకం కింద ఉచిత విద్యుత్ కనెక్షన్ పొందేందుకు అనర్హులని కేంద్రం ప్రకటించింది. విద్యుత్ సదుపాయాన్ని నోచుకోని పేదల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీకి ఇటీవల కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
2019 మార్చి 31 లోగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ విద్యుత్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సామాజిక ఆర్థిక కుల గణన (సీఈసీసీ) సమాచారం ఆధారంగా సౌభాగ్య పథకం కింద లబ్ధిదారుల ఎంపిక జరపాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన కేంద్ర విద్యుత్ శాఖ సోమవారం మార్గదర్శకాలను ప్రకటించింది. వీటి ప్రకారం ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నా ఈ పథకానికి అనర్హులు.
సీఈసీసీ సర్వేలో కుటుంబాలను మూడు స్థాయి (స్టేజ్)లుగా విభజించగా, ప్రథమ స్థాయిలోని కుటుంబాలు ‘సౌభాగ్య’ఉచిత విద్యుత్ కనెక్షన్లకు అనర్హులని కేంద్రం తెలిపింది. రెండో స్థాయి కుటుంబాలు ఆటోమేటిక్‌గా అర్హులవుతాయని, మూడో స్థాయిలోని కుటుంబాలను నిర్ణీత అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక జరపాలని సూచించింది. ఒక్కో విద్యుత్ కనెక్షన్ జారీకి డిస్కంలకు కేంద్రం రూ.500 చెల్లించనుంది. ఈ విద్యుత్ కనెక్షన్ల జారీకి అవసరయ్యే వ్యయంపై అంచనాలు పంపాలని రాష్ట్రాలను కోరింది.
ఇవి ఉంటే అనర్హులు (ప్రథమ స్థాయి)
♦ 2/3/4 చక్రాల వాహనాలు/ చేపలు పట్టే బోటు
♦ 3–4 చక్రాల వ్యవసాయ యంత్రాలు
♦ రూ.50 వేలకు పైగా రుణ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డు
♦ ప్రభుత్వ ఉద్యోగి
♦ వ్యవసాయేతర వ్యాపారాలను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న గృహాలు
♦ కుటుంబ సభ్యుడు నెలకు రూ.10 వేలకు పైగా సంపాదిస్తే..
♦ ఆదాయ పన్ను చెల్లింపుదారులు
♦ వృత్తి పన్ను చెల్లింపుదారులు
♦ మూడు లేదా అంతకు మించి గదులు కలిగిన పక్కా గృహాలు
♦ రిఫ్రిజిరేటర్
♦ ల్యాండ్‌లైన్ ఫోన్
♦ 2.5 ఎకరాలకు పైగా ఆరుతడి భూమితో పాటు ఒక ఇరిగేషన్ యంత్రం కలిగి ఉన్నవారు
♦ 5 ఎకరాలు ఆపై ఆరుతడి భూమి కలిగి ఉన్నవారు
♦ 7.5 ఎకరాలు, ఆపై భూమి కలిగి ఉండటంతో పాటు ఒక సాగునీటి పరికరాన్ని కలిగి ఉన్న వారు
వీరు నేరుగా అర్హులు (రెండో స్థాయి)
♦ ఇళ్లు లేని కుటుంబాలు
♦ అనాథలు
♦ పాకీ పని చేసే కుటుంబాలు (మాన్యువల్ స్కావెంజర్స్)
♦ ఆదిమ గిరిజన సమూహాల కుటుంబాలు
♦ విముక్తి పొందిన నిర్బంధ కార్మికులు ఇళ్లు లేదా గుడిసె ఉన్నా పై కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలి.
నిర్ణీత అర్హతలతో వీరు కూడా అర్హులే.. (మూడో స్థాయి)
పేద కుటుంబాలను గుర్తించే దారిద్య్ర సూచీకి సంబంధించి ఈ కింది 7 అంశాల ఆధారంగా ఉచిత విద్యుత్ కనెక్షన్‌కు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
♦ ఒక గది కలిగి కచ్చా గోడలు, కచ్చా పై కప్పు గల ఇళ్లల్లో ఉండే కుటుంబాలు
♦ 16–59 ఏళ్ల మధ్య వయసు గల వారెవరూ లేని కుటుంబాలు
♦ 16–59 మధ్య వయసుండి పురుష సభ్యులెవరూ లేకుండా కుటుంబ పెద్దగా మహిళ ఉన్న కుటుంబాలు
♦ వికలాంగులు, శరీరం సహకరించని వయోవృద్ధులున్న కుటుంబాలు
♦ ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు
♦ 25 ఏళ్లకు పైగా వయసు కలిగి అక్షరాస్యులైన సభ్యులెవరూలేని కుటుంబాలు
♦ భూమి లేక కూలీపై ఆధారపడిన కుటుంబాలు
Comments
Please login to add a commentAdd a comment