
ఎన్నికలనగానే గుర్తుకొచ్చేది ఆర్భాటపు ప్రచారం.. సినీ గ్లామర్. అలాంటి సినీ సౌందర్యం హెలికాప్టర్ ప్రమాదంలో సజీవంగా కాలిపోయిన ఘటన సినీ ప్రపంచాన్ని కలిచివేసింది. తెలుగు సినీ ప్రపంచంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన సౌందర్య పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తూ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. 15 ఏళ్ల క్రితం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడీ సంగతెందుకంటే.. ఆమె అప్పట్లో కరీంనగర్ లోక్‌సభ స్థానంలో జరిగే ప్రచారానికి వస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల ప్రచారానికి సౌందర్య రావాల్సి ఉంది.
2004 ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి సౌందర్య హెలికాప్టర్‌లో బయల్దేరారు. కొద్దిసేపటికే బెంగళూరు శివారులోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సౌందర్య దుర్మరణం చెందారు. వాస్తవానికి ఆమె ఆ రోజు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్‌షోలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం 4.30 గంటలకు ఎల్లారెడ్డిపేటలో రోడ్‌షోలో పాల్గొనాలి. సాయంత్రం 5.30 గంటలకు సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం చేయాలి. అదే రోజు రాత్రి 7 గంటలకు కరీంనగర్ సర్కార్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో సౌందర్య ప్రసంగించాల్సి ఉంది. కానీ, ఆమె అందుకోసం బయల్దేరుతూనే ప్రాణాలొదిలారు. దీంతో అప్పటి ఎన్నికల ప్రచార సభలు కాస్తా కరీంనగర్ జిల్లాలో సంతాపసభలుగా మారిపోయాయి. నాటి సంగతులను ఇప్పటికీ ఇక్కడ ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు. ఇక, ఆ లోక్‌సభ ఎన్నికల్లో చెన్నమనేని విద్యాసాగర్‌రావు టీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. – వూరడి మల్లికార్జున్, సాక్షి– సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment