గురువారం కామారెడ్డి జిల్లా మద్నూర్ శివారులో కురుస్తున్న భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే శాయ్. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామా బాద్ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు,మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తా యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది. ’తెలంగాణలోని అనేక ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలోని మొత్తం ప్రాంతాలు, కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో మొత్తం ప్రాంతాలు, దక్షిణ ఒడిశాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలోని మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు, అసోం, మేఘాలయలోని మరి కొన్ని ప్రాంతాల్లోకి ఇవి విస్తరించాయి.
మధ్య అరే బియా సముద్రంతో పాటు మహారాష్ట్రలో మరి కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం లోని మొత్తం ప్రాంతాలు, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతా ల్లోకి 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించింది. దీంతో శని, ఆదివారాల్లో రుతుపవ నాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం కనిపి స్తోంది. కాగా, గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
కొంచెం ముందు.. కొంచెం లేటు
వాస్తవానికి, మన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవ నాలు ఈ ఏడాది జూన్ 8నే ప్రవేశించాలి. కానీ మూడు రోజులు ఆలస్యంగా 11న వచ్చాయి. కానీ గత ఏడాదితో పోలిస్తే మాత్రం పది రోజులు ముందే ప్రవేశించాయి. 2019లో జూన్ 21న, 2018లో జూన్ 8న ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మొత్తమ్మీద తొలకరి జల్లులు పలకరించిన వెంటనే రుతుపవనాలు కూడా రావడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మరోవైపు ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయని, వచ్చే మూడు నెలలపాటు సాధారణం కన్నా ఎక్కువ వర్షం వస్తుందని వాతావరణ నిపుణుల అంచనా. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు సంబంధించి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా చాలావరకు సాధారణ వర్షపాతం (96 నుంచి 104 శాతం) నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జూన్‌లో 102 శాతం, జూలైలో 103 శాతం, ఆగస్టులో 97 శాతం, తెలంగాణలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షపాతం 102 శాతం ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
అత్యధికంగా 20.4 సెం.మీ వర్షం
రాష్ట్రంలో గురువారం అంతా మేఘావృతమై కని పించింది. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రి జిల్లాల్లో 11.5 నుంచి 20.4 సెం.మీల మధ్యలో వర్షపాతం నమోదైంది. ఇక 6 నుంచి 11 సెం.మీల మధ్యలో వర్షం కురిసిన జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, భూపాలపల్లి, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా సాధారణ వర్షాలు కురిశాయి. మొత్తమ్మీద జూన్‌లో గురువారం నాటికి 142 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్ 1–11 వరకు సాధారణ వర్షపాతం 28.8 మిల్లీమీటర్లు కాగా, 69.6 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్ 11న 3.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 69.6 మిల్లీమీటర్లు నమోదైంది.
రేపు, ఎల్లుండి భారీవర్షాలు..
రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు బాగానే కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. దీని కారణంగా శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం అక్కడక్కడ భారీ నుండి అతి భారీవర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తగ్గిన ఉష్ణోగ్రతలు..
వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యధికంగా మంథనిలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొమురంభీతో సహా 8 జిల్లాల్లో 39 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం నల్లగొండలో 34.2, హైదరాబాద్‌లో 28.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే నిజామాబాద్‌లో 8.5, హన్మకొండలో 7.3, మెదక్‌లో 1.9 డిగ్రీలు తక్కువగా నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment