కాంట్రాక్టర్లే సైంధవులు
- ఆపరేటర్ల ఎంపికలో డీఈలు, కాంట్రాక్టర్ల మధ్య వివాదం
- వినియోగానికి దూరంగా21 సబ్‌స్టేషన్లు
- ప్రజలకు తప్పని లోఓల్టేజీ కష్టాలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సబ్ స్టేషన్లు లక్ష్యానికి దూరంగా ఉండిపోయాయి. వీటి నిర్వహణ విషయంలో కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య తలెత్తిన వివాదం ప్రజలకు శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఆపరేటర్ల నియామకం విషయమై ఇరువర్గాల మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో సబ్ స్టేషన్లు ఎందుకూ కొరగాకుండాపోతున్నాయి.
చంపాపేట్, ఆల్మాస్‌గూడ, నాదర్‌గుల్, బైరమల్‌గూడ, ఇంజాపూర్, సాహెబ్‌నగర్, వనస్థలిపురం, బాలాజీన గర్, ఎన్‌ఎన్‌నగర్, సైనిక్‌పురి కాలనీ, చింతల్, ఎర్రకుంట, మామిడిపల్లి, మాతశ్రీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, జేటీపీఎల్, నిజాంపేట్, మియాపూర్, హయత్‌నగర్, వ సంతపురి, మల్కజ్‌గిరిలలో కొత్తగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ సబ్ స్టేషన్లు నేటికీ రీ చార్జికి నోచుకోలేదు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన లైన్స్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి అక్రమార్కులకే వంతపాడుతుండటం కొసమెరుపు.
ముందుకు కదలని పనులు
గ్రేటర్‌లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్-ఏపీడీఆర్‌పీ కింద తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీఎస్పీడీసీఎల్)కి రూ.806.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.143.84 కోట్లతో 64 సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. 2014 చివరికి పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించింది. తొలి విడతలో 19 సబ్‌స్టేషన్లు నిర్మించి, సేవలను వినియోగంలోకి తెచ్చింది. రెండో విడతలో 21 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. పనులు పూర్తి కావడంతో ట్రయల్న్ రకూడా చేశారు. ఇదంతా పూర్తయి ఎనిమిది నెలలైనాఇప్పటి వ రకు వినియోగంలోకి తీసుకురాలేదు.
డీఈలపై కత్తిగట్టిన కాంట్రాక్టర్లు
సబ్‌స్టేషన్ల నిర్వహణ కోసం ఆపరేటర్ల నియామకానికి రంగారెడ్డి లైన్స్ విభాగం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆపరేటర్ల ఎంపికలో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు డిస్కం కొన్ని నిబంధనలు విధించింది. ఐటీఐ పూర్తి చేసిన స్థానిక యువకులనే ఆపరేటర్లుగా ఎంపిక చేయాలని సూచించింది. ఇలా చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అక్రమాలకు తావుండదని అధికారుల అభిప్రాయం. అ క్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది కాంట్రాక్టర్లకు ఇది మింగుడు పడలేదు.
ఈ నిబంధనను ఎత్తివేయాలని కొందరు కాంట్రాక్టర్లు డీఈలపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు లొంగకపోవ డంతో వారిపై కత్తిగట్టారు. తమ పలుకుబడినిఉపయోగించి, అధికారుల యత్నాన్ని అడ్డుకునే పనిలో పడ్డారు. ఇంతలో మరికొంతమంది కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించి, పనులను నిలిపివేయించడంతో సబ్ స్టేషన్లు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.
గ్రేటర్‌కు మంజూరైన 33/11కేవీ సబ్‌స్టేషన్లు : 64
తొలి దశలో పూర్తయినవి : 19
రెండో దశలో పూర్తయినవి : 21
వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నవి : 24
విద్యుత్ డిమాండ్...
2006లో : 1538 మెగావాట్స్
2010లో : 1881 మెగావాట్స్
2014లో : 2500 మెగావాట్స్
గ్రేటర్‌లో విద్యుత్ వినియోగదారుల సంఖ్య...
2006లో : 24.12 లక్షలు
2010లో : 29.75 లక్షలు
2014లో : 38 లక్షలు