మీడియాతో మాట్లాడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్ ఝ
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టు బలగాలకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులలో 10మంది మావోయిస్టులతో పాటు ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్ ఝ తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో నిఘా పెట్టామని తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.
మృతి చెందిన మావోయిస్టుల్లో ఇద్దర్ని గుర్తించామని, బూద్రి అలియాస్ రేణుక, సంజీవ్ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాళ్లుగా ఎస్పీ వెల్లడించారు. మిగిలిన మృతదేహాలను ఇవాళ రాత్రికి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని అన్నారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47తో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన కమెండో సుశీల్ కుమార్ మృతదేహానికి ఎస్పీ అంబర్ కిషోర్ ఝా నివాళులు అర్పించారు.
చర్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందారు. మరో కీలక నేత బడే చొక్కారావు కూడా నేలకొరిగారు. పోలీసులు సైతం వీరి మరణాలను ధృవీకరించారు. నిషేధిత సీపీఐ -మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు ఆరుగురు మహిళలు, ఓ కమెండో సహా మొత్తం 11 మంది ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment