
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవా భావం, సామాజిక స్పృహ, జాతీయతాభావం పెంపొందించేందుకు నేషనల్ క్యాడెట్ కోర్స్ (ఎన్‌సీసీ) తరహాలోనే రాష్ట్రంలో స్టూడెంట్ పోలీసు క్యాడెట్ (ఎస్‌పీసీ) విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ–పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ చర్యలు ప్రారంభించాయి. త్వరలోనే రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం జిల్లాల వారీగా 44 పాఠశాలలను గుర్తించింది. ఆయా పాఠశాలల్లోని ఒకరు/ఇద్దరు టీచర్లకు త్వరలోనే రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ తరువాత ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టనుంది. వారంలో 5 పరేడ్‌లను విద్యార్థులకు నిర్వహించనుంది. అంతేకాదు ఎస్‌పీసీలో చేరిన విద్యార్థులకు భవిష్యత్తులో ఎన్‌సీసీ తరహాలోనే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ
ఎస్‌పీసీ కింద ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. వారిలో క్రమశిక్షణ, సేవా భావం, సామాజిక స్పృహ, ప్రత్యేక శిక్షణ వంటివి ఇవ్వడం వల్ల విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనుంది. స్థానికంగా జాతరలు, ఇతర ప్రత్యేక అవసరాల్లో వాలంటీర్లుగా వారి సేవలను వినియోగించనుంది. ప్రధానంగా ఏడు లక్ష్యాలతో ఈ ఎస్‌పీసీని ఏర్పాటు చేయనుంది. ఒక్కో పాఠశాలలో 44 మంది విద్యార్థులను ఇందుకు ఎంపిక చేయనుంది. ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో దానిని 9వ తరగతి విద్యార్థులకు వర్తింపజేసే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన ప్రత్యేక యూనిఫారాన్ని కూడా పోలీసు శాఖ డిజైన్ చేసినట్లు తెలిసింది.
పరేడ్‌తోపాటు వివిధ అంశాలపైనా శిక్షణ
విద్యార్థులకు పరేడ్‌తోపాటు సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలి, నా కుటుంబం – నా భవిష్యత్తు, సమాజంలో పౌరుడు ఎలా ఉండాలి.. నేను సమాజానికి ఏ విధంగా తోడ్పడతాను.. నా ఆరోగ్యం ఎలా ఉండాలి.. పర్యావరణం, ట్రాఫిక్‌పై అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వారంలో 3 పీరియడ్లు పాఠశాలలో శిక్షణ ఇవ్వడంతోపాటు మరో 2 గంటలపాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.
ఎంపిక చేసిన పాఠశాలలు..
నిజమాబాద్ – 4, నిర్మల్ – 4, సంగారెడ్డి – 4, ఆదిలాబాద్ – 4, వికారాబాద్ – 3, జోగులాంబ గద్వాల – 3, నల్గొండ – 4, మహబూబ్‌నగర్ – 5, జగిత్యాల – 3, కామారెడ్డి – 4, హైదరాబాద్ – 5, సైబరాబాద్ – 1.
Comments
Please login to add a commentAdd a comment