అన్నదాతకు ‘క్రెడిట్‌’  | Special Article About Kisan Credit Card To Farmers | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ‘క్రెడిట్‌’ 

Published Fri, Aug 30 2019 3:10 AM | Last Updated on Fri, Aug 30 2019 9:31 AM

Special Article About Kisan Credit Card To Farmers  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, సాగు ఖర్చులు.. ఇలా పెట్టుబడికి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే అధిక మొత్తానికి అప్పు తెస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. సాధారణంగా ప్రజలు వినియోగించే క్రెడిట్‌ కార్డు లాంటి వాటిని రైతులకు ఇవ్వాలని భావిస్తోంది. బ్యాంకులతో మాట్లాడి కార్డు ఇప్పించడం ద్వారా అధిక వడ్డీల నుంచి అన్నదాతను ఆదుకోవాలన్న దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే ‘కిసాన్‌ క్రెడిట్‌ కార్డు’. అనేక రాష్ట్రాల్లో ఈ కార్డులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నా, తెలంగాణలో పెద్దగా ప్రచారంలేదు. అసలేంటి ఈ క్రెడిట్‌ కార్డు వివరాల్లోకి వెళితే... 

రుణాలిచ్చేందుకు బ్యాంకుల పేచీ
రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తాత్సారం చేస్తున్నాయి. గత నాలుగైదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏడాదికేడాదికి లక్ష్యాలను ఘనంగా పేర్కొంటున్నా, రైతులకు ఇచ్చే సరికి బ్యాంకులు అనాసక్తి చూపిస్తున్నాయి. దీంతో రైతులు పెట్టుబడి సొమ్ము పుట్టక ప్రైవేటు అప్పుల వైపు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 29 వేల కోట్లు పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు అందులో సగం కూడా ఇవ్వలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.  

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు : 5,00,000 
వ్యవసాయ శాఖ లక్ష్యం : 25,00,000 

ప్రయోజనాలు ఇవీ.. 
విత్తనాలు, పురుగుమందులు, ఎరు వులు, సాగు ఖర్చులు వంటి వ్యవసాయ అవసరాల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తారు. రోజువారీ వ్యవ సాయ సంబంధిత ఖర్చులకూ వినియోగించుకోవచ్చు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ రైతు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పొందడానికి అర్హుడే. కొన్ని పరిమితుల మేరకు కౌలు రైతులకు ఇస్తారు. భూమి ఉన్న రైతు తన పట్టాదారు పాసు పుస్తకాన్ని తీసుకెళ్లి సాధారణ డాక్యుమెంటేషన్‌ ద్వారా బ్యాంకులో పొందవచ్చు. రైతుకు బీమా కవరేజీ కూడా ఉంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు తీసుకున్న రైతులకు కేంద్రం రూపే కార్డులు ఇస్తుంది. వాటిని సాధారణ క్రెడిట్‌ కార్డు మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. 

కార్డు పొందండి ఇలా... 
వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు లేదా ఇతర వ్యవసాయేతర కార్యకలాపాల్లో నిమగ్నమైన ఎవరికైనా కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణం ఇస్తారు. రైతు వయస్సు 18 నుంచి 75 ఏళ్ల వరకు ఉండాలి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు దరఖాస్తు చేసేటప్పుడు గుర్తింపు కార్డుండాలి. ఓటరు ఐడి, పాన్, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలైనవాటిలో ఏదో ఒకటి ఉండాలి. పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డును రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు అందిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement