
అందరి దృష్టి ఆలేరు వైపు..
జానకీపురం నుంచి కందిగడ్డ
తండాకు మారిన సీన్
పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన
ఆలేరు ఘటన
ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆలేరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఐఎస్‌ఐ ఏజెంట్లు చనిపోయారన్న వార్త మంగళవారం జిల్లాలో హల్‌చల్ చేసింది. కొన్ని రోజులుగా వరుసగా జిల్లాలో కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగిందని తెలియడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటివరకు మోత్కూరు మండలం జానకీపురం ఎన్‌కౌంటర్ గురించి ప్రజల్లో జరుగుతున్న చర్చ ఒక్కసారిగా ఆలేరువైపునకు మళ్లింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి వికారుద్దీన్‌గ్యాంగ్‌ను హైదరాబాద్‌కు తీసుకువెళుతున్న పోలీసులు జిల్లాలోని ఆలేరు మండలం కందిగడ్డతండా వద్ద ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం సంచలనాన్ని సృష్టించింది. ఎన్‌కౌంటర్ వార్త దావానలంలా వ్యాపించడంతో జిల్లాలో ఏ నోటా విన్నా ఈ మాటే వినిపించింది. గత ఆరురోజులుగా జిల్లా కాల్పుల చప్పుళ్లతో అట్టుడుకుతున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
పోలీసులది పైచేయి అయ్యిందా?
ఆలేరు వద్ద కరుడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్‌తో పాటు మరో నలుగురిని కాల్చిచంపడంతో జిల్లాలో పోలీసులు పైచేయి సాధించారని, ఈ ఘటన పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందనే చర్చ జరుగుతోంది. సూర్యాపేట హైటెక్‌బస్టాండ్‌లో సీఐ మొగిలయ్య బృందంపై కాల్పులు జరిపి ఇద్దరు పోలీసులను చంపి దుండగులు దొరక్కుండా వెళ్లిపోవడం, ఆ తర్వాత తాపీగా రెండు రోజుల తర్వాత రోడ్డుమీద కు వచ్చి హల్‌చల్ చేస్తున్న దుండగులను మట్టుబెట్టడంలో పోలీసుల వ్యవహరించిన తీరు విమర్శల పాలు కావడం అందరికీ తెలిసిందే.
జానకీపురం ఎన్‌కౌంటర్ జరిగిన రోజు మరో కానిస్టేబుల్, ఎస్‌ఐలు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం కూడా పోలీసులు చేజేతులా చేసుకుందేననే అభిప్రాయం వ్యక్తమయింది. ఈ నేపథ్యంలో ఇంటా బయటా విమర్శల పాలవుతున్న పోలీసు యంత్రాంగం మంగళవారం జరిగిన ఘటనతో ఊపిరి పీల్చుకుంది. తీవ్రవాదులపై పోలీసులకు పైచేయి సాధించి పెట్టిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందనే భావన వ్యక్తమవుతోంది. అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా మొత్తంమీద తీవ్రవాదులను హతమార్చడం పోలీసు వర్గాలకు ఊపిరినిచ్చిందనే చెప్పాలి.