
నిఘా నీడలో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్థం గురువారం నిఘా నీడలో జరిగింది. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రేవంత్ ఏకైక కూతురు నైమిశరెడ్డి నిశ్చితార్థం సత్యనారాయణరెడ్డితో జరిగింది. భీమవరానికి చెందిన వెంకట్‌రెడ్డి, లక్ష్మీపార్వతి కుమారుడు సత్యనారాయణ ఫారెన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. రేవంత్ కూతురు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది.
ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, లోకేష్, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, తెలంగాణ టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తదితరులు హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు. మరోవైపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం చర్లపల్లి జైలు నుంచి రేవంత్ నేరుగా ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి భార్య, కుమార్తెతో కలిసి... నేరుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం నిఘా నీడలోకి వెళ్లింది. సివిల్ డ్రెస్‌లో ఏసీబీ అధికారులు రేవంత్‌ను పరిశీలించారు. బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు నిశ్చితార్థం వేడుకలో నేతలెవరితోనూ మాట్లాడవద్దని రేవంత్ ని ఆదేశించిన విషయం తెలిసిందే.