రాములోరి తలంబ్రాలకు... వరిసాగు
తూర్పుగోదావరి(రాజానగరం):భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం నాలుగేళ్లుగా ఏటా గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా వచ్చే ఏడాది శ్రీరామ నవమికి ఒంటిమిట్ట రాములవారికి సమర్పించే తలంబ్రాల నిమిత్తం సంఘం ఆధ్వర్యంలో రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో వరిసాగుకు సోమవారం శ్రీకారం చుట్టారు.
నాతిపాము శ్రీరామ్మూర్తికి చెందిన పొలంలో జై శ్రీరామ్’అని జపిస్తూ, ఏసీబీ డీఎస్పీ జి.మురళీకృష్ణ చేతుల మీదుగా వరి విత్తనాలు చల్లించారు. తొలుత శాస్త్రోక్తంగా ధాన్యలక్ష్మి అనుష్టానంతో విత్తనశుద్ధి చేశారు. ‘శ్రీరామ నామం అనే విత్తనం మనస్సులో నాటుకుంటే జ్ఞానం అనే పంట పండుతుంది’ అని సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు అన్నారు. అదే విశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాములోరి కల్యాణోత్సవాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందించనున్నట్టు చెప్పారు.