సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు మాస్కులకు భలే గిరాకీ పెరిగిపోయింది. ఎన్–95, సర్జికల్ మాస్కులు.. ఇలా బోలెడన్ని మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే ఇవేవీ వైరస్‌ను చంపవు. కాకపోతే గాలిలో లేదా ఇతరుల దగ్గు, తుమ్ము, తుంపర్ల ద్వారా వచ్చే వైరస్‌లు నేరుగా మన నోటిలోకి, ముక్కులోకి చేరకుండా అడ్డుకుంటాయి. అయితే వీటితో వైరస్ సోకదన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న లివింగ్‌గార్డ్ తయారుచేసిన మాస్కు మాత్రం వీటికి చాలా భిన్నమైంది. మూడు పొరలతో సిద్ధమైన ఈ మాస్కులో ప్రత్యేకమైన వస్త్రం ఉంటుంది. దీనిపై కొన్ని రసాయనాలను బలమైన రసాయనిక బంధాల ద్వారా పోగుబడేలా చేశారు. ఫలితంగా ఈ మాస్కుపై నిత్యం 0.1 నుంచి 0.8 మిల్లీవోల్టుల ధనాత్మక విద్యుదావేశం పుడుతుంటుంది. సూక్ష్మజీవులన్నీ రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటాయి.(మళ్లీ లాక్‌డౌన్ ఉండదు)
కాబట్టి వైరస్ మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు సైతం ఈ విద్యుదావేశం బారిన పడి నశిస్తాయి. ప్రతి చదరపు సెంటీమీటరుకు ఏకంగా 3,600 కోట్ల విద్యుదావేశాలు పుడుతుంటాయి. కాబట్టి వీటిని తాకిన సూక్ష్మజీవుల పైపొరలు బద్ధలైపోతాయి. అక్కడికక్కడే మరణిస్తాయి లేదా నిర్వీర్యమవుతాయని కంపెనీ సీటీవో, భారతీయ శాస్త్రవేత్త సంజీవ్ స్వామి బుధవారం జరిగిన ఓ వెబినార్‌లో తెలిపారు. సీఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్‌ఏ మషేల్కర్ కూడా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. వెయ్యి వరకు పాలి కాటయానిక్ రసాయనాలను పరిశీలించామని, వాటి నుంచి అవసరమైన లక్షణాలున్న 3 నుంచి 7 రసాయనాలను ఎంపిక చేసి ప్రత్యేక పద్ధతుల్లో కలిపి, వస్త్రంపై అవి అతుక్కునేలా చేశామని స్వామి వివరించారు. వీటిని ఉతుక్కుని తిరిగి వినియోగించుకోవచ్చని తెలిపారు.
విస్తృత పరీక్షల తర్వాత అందుబాటులోకి..
లివింగ్‌గార్డ్ మాస్కును మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చే ముందు పలు యూనివర్సిటీల్లో దానిపై విస్తృత పరీక్షలు చేశారు. బెర్లిన్‌లోని ఫ్రీ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ఈ మాస్కు 99.9 శాతం వరకు వైరస్‌లను అడ్డుకుని నిర్వీర్యం చేస్తున్నట్లు తేలింది. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీ కూడా దీన్ని పరిశీలించి బాగా పనిచేస్తుందని నిర్ధారించింది. అమెరికా మిలిటరీ వర్గాలు, ముంబైలోని సియాన్ ఆసుపత్రి వైద్యులు, కొంతమంది పారిశుధ్య కార్మికులు కొంతకాలంగా ఈ మాస్కులను వాడుతున్నారు. అమెరికాలోని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మాస్కుల తయారీకి ఉపయోగించిన ప్రత్యేక వస్త్రాన్ని క్షుణ్నంగా పరిశీలించిందని, మానవ శరీరానికి హానికరం కాదని నిర్ధారించినట్లు స్వామి తెలిపారు.
ధర సంగతేంటి..?
లివింగ్‌గార్డ్ సంస్థ మొత్తం మూడు రకాల మాస్కులను తయారు చేయగా వీటి ఖరీదు రూ.1,490– 1,990 మధ్య ఉంటుంది. మొత్తం 3 పొరలు ఉండే ఈ మాస్కు ద్వారా 5 రకాల రక్షణ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. వారానికి ఒకసారి ఉతుక్కుంటూ మొత్తం 210 రోజుల పాటు ఈ మాస్కును వాడొచ్చు. లివింగ్ గార్డ్ మాస్కుతో పాటు చేతితొడుగులు తొడుక్కుంటే ఉపరితలాలపై ఉండే వైరస్‌లను అక్కడికక్కడ చంపేయొచ్చని, త్వరలో బాడీ సూట్లు కూడా అందుబాటులోకి తెస్తామని సంజీవ్ స్వామి ‘సాక్షి’ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నవీ ముంబైలోని ఓ ఫ్యాక్టరీలో వస్త్రాన్ని తయారు చేస్తున్నామని, బెంగళూరు పరిసరాల్లో మాస్కులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హోటళ్లు, విమాన ప్రయాణాల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. తిరిగి వాడుకునే వీలు ఉండటంతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత్‌లో వారానికి 1.5 లక్షల మాస్కులు తయారు చేసే సామర్థ్యం ఉందని, దశల వారీగా ఉత్పత్తి పెంచుతామని వివరించారు. వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో అమ్మకాలు మొదలుకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment