
ఎదుర్కోలు ఉత్సవంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
భద్రాద్రి రామయ్యకు పెళ్లికళ వచ్చింది. రామాలయంలోని బేడా మండపం వేడుకలకు సిద్ధమైంది. నేటి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ మహోత్సవం జరగనుంది. రేపు రామయ్య పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ సారి వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. శుక్రవారం పట్టాభిషేకం జరుపుతారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మాత్రం కోవిడ్–19 లాక్‌డౌన్ కారణంగా భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు జరగనున్నాయి. ప్రతీ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వీక్షిస్తుండగా అట్టహాసంగా వేడుకలు జరుగుతాయి. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం భక్తులు ఎవరూ లేకుండా ఇలా వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఈ సమయంలో భద్రాచలం చుట్టుపక్కల ఆధ్యాత్మిక సందడి ఉండేది. ఈసారి మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రతీసారి కల్యాణం మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లతో నిర్వహించేవారు. ప్రస్తుతం ఆలయంలోని బేడా మండపంలో కల్యాణ క్రతువు నిర్వహించనున్నారు. ఇప్పటికే భద్రాచలం సీతారామచంద్ర లక్ష్మణ స్వాముల బ్రహ్మోత్సవాలను సైతం ఆలయానికే పరిమితం చేశారు. గత నెల 25న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గత నెల 20వ తేదీ నుంచి ఆలయంలో నిత్యకల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో భక్తుల సర్వదర్శనాలను సైతం నిలిపేశారు. భక్తులెవరూ ఆలయానికి రావద్దని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీరామనవమి కల్యాణం కోసం అప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా అమ్మిన టికెట్ల డబ్బులను కూడా ఆయా భక్తులకు తిరిగి ఇవ్వనున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు. సీతారామచంద్ర కల్యాణాన్ని, పట్టాభిషేకాన్ని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ భక్తలకు సూచించారు. వేడుకలకు అర్చకులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు.
భద్రాచలంలో నేడు జరిగే శ్రీరామనవమి వేడుకలను ఇంటి నుంచే వీక్షించాలని కలెక్టర్ ఎం.వి. రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. లాక్‌డౌన్‌ను పాటించని వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
భద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్ర ప్రభువుల వారికి ఎదుర్కోలు ఉత్సవం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను దివ్యాభరణాలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వద్దకు తీసుకువచ్చారు. రామయ్యను, సీతమ్మను ఎదురెదురుగా ఆశీనులను చేశారు. అర్చకులు రామయ్య తరఫున కొందరు, సీతమ్మ తరఫున మరికొందరు ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు. ఎదుర్కోలు ఉత్సవ ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. రామయ్య గుణగణాలను, విశిష్టతను, సీతమ్మ అందచందాలను, గుణగణాలను, యోగ్యతను మంత్రోచ్ఛరణల మధ్య వివరిస్తూ రెండు గంటల పాటు తంతును కొనసాగించారు. ఈ ఉత్సవంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, దేవస్థానం ఈఓ జీ నర్సింహులు తదితరులు, అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment