నేడు పట్టాభిషేకం | Sri Sita Rama Kalyanam Celebration In Khammam | Sakshi
Sakshi News home page

నేడు పట్టాభిషేకం

Published Mon, Apr 15 2019 6:45 AM | Last Updated on Mon, Apr 15 2019 6:45 AM

Sri Sita Rama Kalyanam Celebration In Khammam - Sakshi

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి సోమవారం పట్టాభిషేకం చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియం వేదికపైనే పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపిస్తారు. సోమవారం ఉదయం మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో మిథిలా స్టేడియంలో ఆశీనులను చేస్తారు. అనంతరం విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేకం మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేస్తారు. తర్వాత పవిత్ర నదీ జలా లతో స్వామివారికి అభిషేకం జరిపి అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన గావిస్తారు. కల్యా ణంలో లాగే అభిజిత్‌ ముహూర్తంలో సరిగ్గా మధ్యా హ్నం 12గంటలకు రజిత సింహాసనంపై శ్రీ సీతారామచంద్రస్వామివారిని పట్టాభిషిక్తుడ్ని చేస్తారు.

ఒక్కో ఆభరణం ధరింçపజేస్తూ... 
రాముడికి పట్టాభిషేకం నిర్వహించే సమయంలో రామదాసు చేయించిన ఆభరణాలను ధరింపజేయడం ఆనవాయితీ. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్‌ కిరీటం.. ఇలా ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను తెలుపుతూ స్వామివారికి అలంకరిస్తా రు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన ముహూర్తంలోనే భద్రాచలంలో కూడా పట్టాభిషేకం నిర్వహించడం రామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. 60 ఏళ్లకు మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 ఏళ్లకు ఒకసారి పుష్కర ప్రయుక్త సామ్రాజ్య పట్టాభిషేకం, ప్రతి యేటా కల్యాణం మరుసటి రోజున పట్టాభిషేకం నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో పట్టాభిషేక స్వర్గను పారాయణం చేస్తారు. వేడుక అనంతరం రామయ్యను అంతరాలయంలో వేంచేయింపజేస్తారు.

హాజరుకానున్న గవర్నర్‌ ... 
శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సోమవారం నిర్వహించే పట్టాబిషేక మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్నారు. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఆలయ అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement