సాక్షి, మంథని : వారిద్దరూ రాజకీయ శత్రువులు. ఎక్కడ ఎదురుపడినా ఎడమొహం.. పెడమెహమే ఉంటుంది. అయితే బుధవారం మంథనిలో సింగరేణి సంస్థ ఆర్జీ– 3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ పుట్టమధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక బొక్కలవాగు కరకట్టలపై మొక్కలు నాటారు. అనంతరం హరితహారంపై సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుట్టమధు, శ్రీధర్‌బాబు ఒకే వేదికపై కూర్చున్నారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఇరు పార్టీల కార్యకర్తలు ఇద్దరు నేతలకు మద్దతుగా పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సింగరేణి అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రొటోకాల్ లేదని, సింగరేణి అధికారులపై ఒత్తిడిచేశారని జిల్లా పరిషత్ చైర్మన్ కౌంటర్ ఇచ్చారు. అనంతరం జిల్లాపరిషత్ పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. మొత్తంమీద కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో కార్యకర్తలు.. పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment