విపక్షాలది క్షుద్రరాజకీయం
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ అంటేనే ప్రకృతిని ప్రేమించే పండగని, తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో లేని పండగ ఇదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా పేదవారికి కొత్త చీరలు బహూకరించడంతోపాటు, చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చీరల పంపిణీని మొదటిసారి ప్రారంభించారని ఆయన తెలిపారు. కానీ, చీరల విషయంలో విపక్షాలు క్షుద్ర రాజకీయం చేస్తూ, ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ చీరలు కాల్చి విపక్షాలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయని ధ్వజమెత్తారు. అసలు కానుకలకు ఎలా వెల కడతారని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ సిద్ధాంతాలు పక్కనపెట్టి సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. తెలంగాణలో ఉన్నట్టుగా విపక్షాల నీచ రాజకీయాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. చీరలు కాలిస్తే బతుకమ్మను, తెలంగాణను అవమానించినట్టేనని, వారు కాల్చింది చీరలను కాదని, తెలంగాణ సంస్కృతిని అని పేర్కొన్నారు.
చీరలు తగలబెడితే మహిళలే ఉరికించి కొడుతారని, చీరలు కాల్చడం వెనక ఎవరున్నారో ప్రభుత్వం కచ్చితంగా తేల్చి తీరుతుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో టీఆర్‌ఎస్ ఎంపీ కవితను లాగడం విపక్షాల ఉన్మాదానికి నిదర్శనమన్నారు. పేదవారు బాగుపడుతున్నారని విపక్షాలకు కడుపు మండుతోందన్నారు. కాంగ్రెస్ టీడీపీల బతుకే కుంభకోణాల బతుకని, వారికి అన్నీ కుంభకోణాల్లాగే కనిపిస్తాయని ఆయన ఎద్దేవా చేశారు.