సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ–కేరళ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు నిరంతరం కొనసాగేలా త్వరలో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంటామని పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. శనివారం కేరళ రాష్ట్రంలో ఆయన పర్యటించారు. కేరళ, తెలంగాణ టూరిజం శాఖలు కలసి పనిచేయాలన్న శ్రీనివాస్‌గౌడ్ సూచన మేరకు కేరళ పర్యాటక మంత్రి సురేంద్రన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. కేరళ రాష్ట్ర పండుగ ఓనంను తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. కేరళ–తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయని, మలయాళీల సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గౌరవిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment