భద్రగిరిలో నేడు రాములవారి కల్యాణం | srirama navami celebrations in bhadrachalam today | Sakshi
Sakshi News home page

భద్రగిరిలో నేడు రాములవారి కల్యాణం

Published Sat, Mar 28 2015 1:06 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

భద్రగిరిలో నేడు రాములవారి కల్యాణం - Sakshi

భద్రగిరిలో నేడు రాములవారి కల్యాణం

ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు  
 పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ రాక
 
 భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శనివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది.  శ్రీ రామనవమి రోజున భద్రగిరిలో జరిగే స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ తంతు శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమౌతుంది. అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావిస్తారు.
 
 ఈ కమనీయ తంతును మిథిలా స్టేడియంలో 36 వేల మంది వరకు  భక్తులు కూర్చొని తిలకించేందుకు ప్రత్యేకంగా సెక్టార్‌లను ఏర్పాటు చేశారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూలర్లను సైతం ఏర్పాటు చేశారు.  స్వామివారి కల్యాణం జరిగే మిథిలా స్టేడియూన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు వారి కోసం ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామాలయూనికి విద్యుత్ దీపాలను అలంకరించటంతో విద్యుత్ కాంతుల నడుమ శోభాయమానంగా కనిపిస్తోంది. భక్తులందరికీ స్వామి వారి ప్రసాదాలను అందించేందుకు సుమారు 2 లక్షల లడ్డూల ప్రసాదాలను సిద్ధం చేశారు. 60 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈసారి అందరికీ ముత్యాల తలంబ్రాలను అందించాలనే ఉద్దేశంతో రూ. 50 లకు ఒక ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.
 
 పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం


 
 తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనుండగా, ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకువస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సీతారాంనాయక్ శుక్రవారం భద్రాచలంలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రాకతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంలో ఇదే వేదికపై వచ్చే ఆదివారం స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. దీనికి గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు.
 
 
 ఖమ్మం చేరుకున్న కేసీఆర్
 
 భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగానే శుక్రవారం  ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. రాత్రి భద్రాచలంలో బస చేశారు. శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ప్రభుత్వం తరఫున సీఎం తీసుకురావడం ఆనవాయితీ. ఇప్పటిదాకా అందరు సీఎంలూ నేరుగా నవమి నాడే వాటిని తీసుకురాగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న సీతారాముల కల్యాణ వేడుకలో పాల్గొనేందుకు కేసీఆర్ మాత్రం ఒక రోజు ముందే సకుటుంబంగా భద్రాచలం వచ్చారు. కల్యాణానికి రాత్రి బస చే సిన తొలి సీఎం అయ్యారు.అందరు సీఎంలూ హెలికాప్టర్‌లో రాగా కేసీఆర్ రోడ్డు మార్గాన వచ్చారు. ఖమ్మం సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద తుమ్మల నాగేశ్వరరావు తదితర మంత్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
 
 వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం
 శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. సీతమ్మ తల్లి, రామయ్య తండ్రికి పెళ్లి సందర్భంగా వారివారి వంశాల గొప్పతనాన్ని గురించి చెప్పుకునే ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మా వంశం గొప్పదంటే ... కాదు మా వంశమే గొప్పదని చెబుతూ కొంతమంది సీతమ్మ వారివైపు, మరికొంతమంది రామయ్య వారివైపు చేరి ఈ వేడుకను నిర్వహించారు. గతంలో రాజవీధిలో ఈ వేడుకలను నిర్వహించేవారు. ఈ ఏడాది స్వామివారిని భక్తులంతా దర్శించుకునేందుకు వీలుగా కల్యాణ మండపం వద్దనే నిర్వహించారు. కల్యాణ మూర్తులకు ప్రభుత్వం తరఫున అందజేసిన పట్టువస్త్రాలను స్వామివార్లకు ధరింపజేశారు. హిందూముస్లింల ఐక్యతను చాటుతూ భక్తులందరికీ పన్నీరును చల్లడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు.
 
 నేడు భద్రాద్రి రాముడికి టీటీడీ పట్టు వస్త్రాలు
 
 సాక్షి , తిరుమల: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి శనివారం టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించనుంది. ఈవో సాంబశివరావు దంపతులు పట్టువస్త్రాలు అందజేసి అక్కడ నిర్వహించే కల్యాణోత్సవంలో పాల్గొంటారు.  అలాగే విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరామచంద్ర మూర్తి ఆలయానికి, అదే జిల్లాలోని మరో రామాలయానికి కూడా సుమారు పదిహేనేళ్లుగా టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించడం సంప్రదాయం. ఇప్పటికే ఆయా ఆలయాలకుతిరుమల ఆలయం నుంచి పట్టువస్త్రాలు పంపారు.
 
 2న ఒంటిమిట్ట కోదండరామునికి శ్రీవారి పట్టు వస్త్రాలు
 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా నవమి వేడుకల్ని నిర్వహించే వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామునికి కూడా టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించనుంది. ఏప్రిల్ 2వ తేది రాత్రి 8 గంటల తర్వాత టీటీడీ ఈవో సాంబశివరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీవెంకటేశ్వర భక్తి చానెల్‌లో పలు ఉత్సవాలను ప్రత్యక్షంగా ప్రసారం చేయనుంది.
 
 
 పదడుగుల అగర్‌బత్తి వెలిగించిన కేసీఆర్ భార్య
 
 ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పది అడుగుల బత్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మంత్రి కేటీఆర్ భార్యతో కలసి శుక్రవారం రాత్రి వెలిగించారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరులోని అంబికా దర్బార్ అగర్‌బత్తిల కంపెనీ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో  శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా పది అడుగుల ఎత్తులో ఉన్న అగర్‌బత్తిని వెలిగిస్తారు. ఈ ఏడాది దీనిని ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపం సమీపంలో ఏర్పాటు చేశారు. ఆరుగురు కార్మికులు వారం రోజుల పాటు శ్రమంచి ఈ అగర్‌బత్తిని తయారు చేసినట్లుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఉపేందర్, ఆనందరావు, కుమార్ రాజా, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement