సమస్యల ‘సొరంగం’ | srisailam left canal works still incomplete in 10 years | Sakshi
Sakshi News home page

సమస్యల ‘సొరంగం’

Published Fri, Apr 17 2015 5:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

సమస్యల ‘సొరంగం’ - Sakshi

సమస్యల ‘సొరంగం’

  •  శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పనులకు అడుగడుగునా అడ్డంకులే
  •  పదేళ్లవుతున్నా ముందుకు సాగని సొరంగం పనులు
  •  కాంట్రాక్టర్ డిమాండ్లతో తలపట్టుకుంటున్న సర్కారు
  •  వంద కోట్ల అడ్వాన్స్ చెల్లించినా.. మరో రూ. 40 కోట్లు కావాలని పేచీ
  •  సొరంగం ఎప్పుడు పూర్తవుతుందో తెలియక రైతుల్లో ఆందోళన
  • సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇది పూర్తి కావాలని లక్షలాది మంది రైతులు ఆశతో ఎదురుచూస్తుంటే, అనేక కారణాలతో అంతకంతకూ జాప్యం పెరుగుతోంది. దీంతో ఆ రైతుల నాలుగు దశాబ్దాల కల ఎప్పుడు నెరవేరుతుందన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. పదేళ్ల క్రితం ప్రారంభమై ప్రహసనంలా మారిన సొరంగం తవ్వకాన్ని పూర్తి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే కాంట్రాక్టు సంస్థకు రూ. 100 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. అయినా సమస్యల సుడిగుండం నుంచి సొరంగం నిర్మాణం ఇంకా బయటపడటం లేదు.

    ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్‌కు తోడు సొరంగం తవ్వకం ద్వారా వచ్చే మట్టిని తరలించే కన్వేయర్ బెల్టు కొనుగోలుకు అదనంగా రూ. 40 కోట్ల వరకు కావాలని కాంట్రాక్టు సంస్థ డిమాండ్ చేస్తోంది. అడిగిన మేరకు నిధులిస్తేనే పనులు సాగుతాయని పేచీకి దిగింది. ఈ మెలికతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. మూడేళ్లలో సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయాలని భావించిన సర్కారుకు ఈ సమస్యలు తలనొప్పిగా మారాయి.
     
     ప్రాజెక్టుకు ఎన్నో ఆటుపోట్లు...
     శ్రీశైలం కుడి గట్టు కాల్వ(ఎస్‌ఆర్‌బీసీ) కింద తెలుగుగంగ ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటిని ఆంధ్రా ప్రాంతానికి ఇస్తున్న మాదిరే అంతేస్థాయి నీటిని తెలంగాణకు ఇవ్వాలన్న నిర్ణయంతో ఎస్‌ఎల్‌బీసీకి 1980ల్లోనే అంకురార్పణ పడింది. గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యం కానందున సొరంగ మార్గం ద్వారా తరలించాలని నిర్ణయించారు. అయితే ఆర్థిక భారాన్ని సాకుగా చూపి అప్పటి ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి నాగార్జునసాగర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేశాయి. అయితే 2005లో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టింది. రూ. 2,813 కోట్లతో పరిపాలనా అనుమతులు కూడా లభించాయి. ఈ పనులకు రూ.1,925 కోట్లతో జయప్రకాశ్ అసోసియేట్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. మొత్తం 43.89 కిలోమీటర్ల సొరంగ పనుల్లో ఇప్పటివరకు కేవలం 24.68 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.21 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. ఈ  పనులకు ఇప్పటికే కాంట్రాక్టు సంస్థ సుమారు రూ.1,300 కోట్లు వరకు ఖర్చు చేసింది. మిగతా పనులకు మరో రూ.650 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉండగా ఆర్థిక భారం కారణంగా పనుల వేగం మందగించింది.
     
     
    అడ్వాన్స్ ఇచ్చినా కదల్లేని పరిస్థితి
    నిజానికి ప్రాజెక్టు పనులు 2010లోనే ముగియాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలకుతోడు కృష్ణా కింద 2009లో వచ్చిన వరదలు సొరంగం పనులకు అడ్డుగా నిలిచాయి. పనులు చేపట్టే సమయంలో ఉన్న సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు, ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉందని, ఈ దృష్ట్యా రూ.750 కోట్ల వరకు ఎస్కలేషన్ బకాయిలకు తోడు, విదేశాల  నుంచి తెప్పించి షిప్‌యార్డుల్లో మూలుగుతున్న సామగ్రిని తెప్పించుకునేందుకు అడ్వాన్స్‌గా రూ.100 కోట్లు చెల్లిస్తేనే పనులు వేగంగా చేస్తామని కాంట్రాక్టు సంస్థ వాదిస్తూ వస్తోంది. 2013లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 మేరకు ఎస్కలేషన్ చార్జీలను చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది. దీనిపై గతంలో చర్చించిన అఖిలపక్షం కేవలం అడ్వాన్స్ చెల్లింపునకు మాత్రమే మొగ్గు చూపగా, ఎస్కలేషన్‌పై ఏమీ తేల్చలేదు. అయితే అడ్వాన్స్ కూడా చెల్లించి మూడు నెలలు గడుస్తున్నా సొరంగ పనుల్లో పెద్ద పురోగతి లేదు.
     
     కేవలం 300 మీటర్ల మేర మాత్రమే తవ్వకం జరిగింది. తాజాగా సొరంగంలో తవ్వుతున్న మట్టిని బయటకు పంపేందుకు సుమారు 10 కిలోమీటర్ల కన్వేయర్ బెల్ట్ అవసపరమని, దీనికి దాదాపు రూ.40 కోట్ల వరకు అవసరమని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది. దీన్ని విదేశాల నుంచి తెప్పించాలని, ఎస్కలేషన్ చార్జీల కింద అడుగుతున్న మొత్తంలోంచి దీన్ని చెల్లించాలని పట్టుబడుతోంది. కన్వేయర్ బెల్టులకు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే అవి రెండుమూడు నెలల్లో వస్తాయని, ఆలస్యం చేసిన కొద్దీ పనుల్లో జాప్యం తప్పదని తేల్చి చెబుతోంది. అయితే ఎస్కలేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థ డిమాండ్లపై ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement