left canal works
-
సాగర్ ఎడమ కాల్వకు మరమ్మతులు
నిడమనూరు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వకు అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు సమీపంలోని వేంపాడు వద్ద బుధవారం సాయంత్రం సాగర్ కాల్వ కట్ట తెగిన విషయం తెలిసిందే. శుక్రవారం అధికారులు కాల్వ కట్టకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా కాల్వలోకి మట్టి, ఇసుక బస్తాలను తరలిస్తున్నారు. కాల్వలో నీటిని నిలిపేందుకు ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారు. దానిని ఆసరాగా చేసుకుని మట్టి కట్టను ఐదు అడుగుల ఎత్తు పోయనున్నారు. కాల్వలో వస్తున్న సీపేజ్ వాటర్‌ను నిలువరించిన వెంటనే గండిని పూడ్చే పనులను చేపట్టే అవకాశం ఉన్నది. సాగర్ ప్రాజెక్టు సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్ఈ ధర్మా ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. సీపేజ్ అంటే..: కాల్వకు నీరు నిలిపివేసిన తర్వాత కూడా అందులో ఉన్న నీరు పారుతుంటుంది. దీనినే సీపేజ్ వాటర్‌గా పేర్కొంటారు. -
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి
సాక్షి, నిడమనూరు: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం–వేంపాడ్ గ్రామాల మధ్య నారెళ్లగూడ మేజర్ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్టకు బుధవారం భారీ గండి పడింది. సాయంత్రం 5.45 గం.కు యూటీ వద్ద నీరు కాల్వ లో సుడి తిరుగుతూ ఉండటం, కట్టకు కింది భాగంలోంచి నీరు అధికంగా వెళ్తుండటం గమనించారు. మొదట అయోమయానికి గురైన రైతులు, తర్వాత బుంగ పడిందని నిర్ధారణ చేసుకున్నారు. సాగర్ ఎడమ కాల్వకు 32.109 కిలోమీటర్ వద్ద ఉన్న యూటీకి (అండర్ టన్నెల్) కుడి పక్కన గండి పడి తర్వాత మొత్తం కొట్టుకుపోయింది. బుంగ కాస్తా పెరిగి గంటలోనే కట్టకు గండిపడింది. కట్ట 30 మీటర్ల మేర కొట్టుకు పోయింది. సాగర్ నుంచి వచ్చే నీరంతా పొలాలకు నర్సింహులగూడెం మీదుగా, నిడమనూరు సమీపంలోని వాగులోకి చేరాయి. వాగు ద్వారా నీరు వెళ్తుండటంతో నిడమనూరుకు ముప్పు తప్పింది. గండి పడిన ప్రాంతానికి తహశీల్దార్ ప్రమీల, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెళ్లి పరిశీలించారు. పూర్తిగా చీకటిపడటంతో ఎక్కడ ఎంత మేర గండి పడిందో అంచనా వేయలేకపోతున్నారు. విషయం తెలుకున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం రాత్రి నీటిని నిలిపివేశారు. నిడమనూరు–నర్సింహులగూడెం మధ్య కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపైకి నీరు రావడంతో ఒక పక్కనే రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఆధునీకరణకు ముందు రెండు చోట్ల గండ్లు సాగర్ ఎడమకాల్వ కట్టకు ఆధునీకరణకు ముందు గండ్లుపడిన సందర్భాలున్నాయి. నిడమనూరు మండలం బీకే పహాడ్ సమీపంలోని వెంగన్నగూడెం మైనర్ తూము వద్ద, హాలియా మండలం ఇబ్రహీంపేట గ్రామం వద్ద కాల్వకట్టకు గండి పడింది. అప్పుడూ వ్యవసాయ పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాగర్ ఎడమకాల్వకు ఆధునీకరణ పనులు చేపట్టిన తర్వాత గండి పడటం మాత్రం ఇదే మొదటిసారి. కట్టబలోపేతం చేయడం వల్ల కట్టకు ఇబ్బంది లేకున్నా యూటీలను ఆధునీకరించకపోవడం వల్లే గండిపడింది. ఇదీ చదవండి: సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో నాట్లు -
పంటలకు పోల‘వరం’..నిర్మాణ దశలోనే అందుతున్న నీరు
పిఠాపురం: పోలవరంలోనే ఉంది వరం. నిర్మాణ దశలోనే రైతులకు వరంగా మారింది. వర్షాధారంతోనే సాగయ్యే మెట్ట భూములకు పనులు పూర్తి కాకుండానే సాగునీరందిస్తోంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ 80 శాతం పనులు పూర్తి కాగా ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పోలవరం కాలువ వేల ఎకరాలలో పంటలకు నీరందించి సిరులు కురిపిస్తోంది. కాలువ తవ్విన ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలకళ ఉట్టిపడుతోంది. ఎక్కడ చూసినా కాలువ నిండా నీటి నిల్వలు ఉండడంతో సమీప పొలాలకు రైతులుమోటార్ల ద్వారా నీటిని తోడి సాగు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పోలవరం కాలువపై ఆధార పడి జిల్లాలో సుమారు 2580 ఎకరాల వరకూ మెట్ట భూముల్లో 2300 ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నారు. అపరాల నుంచి వరి వరకు పోలవరం కాలువపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇంకా ప్రారంభం కాకుండానే రైతులకు ఉపయోగపడుతున్న ఈ కాలువ పనులు పూర్తయితే వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయి. రబీకి అండగా.. వర్షాకాలంలో కాలువ నిండుగా మారి ఎద్దడి సమయంలో సాగు చేసే రబీ పంటకు నీరందిస్తోంది. జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, పెద్దాపురం, తొండంగి, గొల్లప్రోలు తదితర మండాలల్లో ఎక్కువగా పంట పొలాలకు రబీ సీజన్లో నీటి ఎద్దడి ఎదురవుతుంది. అలాంటి సమయంలో కాలువ చివరి భూములకు, మెట్ట భూములకు ప్రస్తుతం పోలవరం కాలువే నీటి వనరుగా మారిపోయింది. కాలవకు ఆనుకుని కిలో మీటరు దూరంలో ఉన్న అన్ని భూములకూ రైతులు ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. సాగు చేసుకుంటున్నారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా కాలువలోని నీటి సహాయంతో ముందుగా నారు మళ్లు వేసుకుంటున్నారు. నీటి ఎద్దడి ఎదురైతే వెంటనే ఇంజిన్ల సహాయంతో నీటిని తోడి పంట ఎండిపోకుండా కాపాడుకుంటున్నారు. కాలువు సమీపంలోని రైతులు ఇంజిన్లతో నీటిని తోడుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఎక్కువ మంది కలిసి నిధులు సమకూర్చుకుని పెద్ద ఇంజిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలవరం కాలువే కాపాడుతోంది నేను ఎనిమిదెకరాలు సాగు చేస్తున్నాను. కాలువ తవ్వక ముందు నీటి ఎద్దడి వస్తే పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలు వచ్చేవి. ఎనిమిదేళ్లుగా పోలవరం కాలువ అండగా నిలిచింది. ఖరీఫ్ నుంచి రబీ, అపరాల సాగు వరకు నీటి ఎద్దడి ఎదురైనా ఇబ్బంది లేకుండా ఉంటోంది. పక్కనే కాలువ నిండా ఎప్పుడు నీరు ఉంటుండడంతో మాకు భయం లేకుండా పోయింది. ఒక వేళ నీటి ఎద్దడి వస్తే ఇంజన్లతో నీరు తోడుకుని సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నాం. – కోరుమిల్లి నూకరాజు, కౌలు రైతు, చెందుర్తి, గొల్లప్రోలు మండలం. కాలువ లేనప్పుడు కష్టాలు పడ్డాం కాలువ లేని సమయంలో చాలా కష్టాలు పడ్డాం. పంట వేయడమే గగనంగా ఉండేది. నీరందక పంటలు ఎండిపోయేవి. ఎక్కువగా బోర్లపై ఆధారపడే వాళ్లం. అదీ కొందరికే అవకాశం ఉండేది. కౌలు రైతులయితే ఒక పక్క పంటలు పోవడం వల్ల అటు కౌలు, ఇటు పెట్టుబడి నష్ట పోయేవారు. ఇప్పుడు పోలవరం కాలువ కొండంత అండగా నిలిచింది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు పంటలు వేసుకుంటున్నాం. . – వాసంశెట్టి శ్రీనివాస్, కౌలు రైతు చెందుర్తి, గొల్లప్రోలు మండలం. పోలవరం కాలువ రైతులకు వరమే బోర్లతో పని లేకుండా కాలువ నీటితో సాగు చేసుకుంటున్నారు. కొంత పెట్టుబడి అయినా పంట నష్ట పోకుండా కాపాడుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో అపరాల సాగు అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు సాగు పెరిగింది. రైతులు ధైర్యంగా సాగు చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి వల్ల పంటలు పోయాయనే మాట వినపడటంలేదు. – సత్యనారాయణ, వ్యవసాయశాఖాధికారి. గొల్లప్రోలు. ఇదీ చదవండి: రీసర్వేలో మరో మైలురాయి.. 8 లక్షలకుపైగా ఎకరాలకు సరిహద్దుల నిర్ణయం -
సమస్యల ‘సొరంగం’
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పనులకు అడుగడుగునా అడ్డంకులే పదేళ్లవుతున్నా ముందుకు సాగని సొరంగం పనులు కాంట్రాక్టర్ డిమాండ్లతో తలపట్టుకుంటున్న సర్కారు వంద కోట్ల అడ్వాన్స్ చెల్లించినా.. మరో రూ. 40 కోట్లు కావాలని పేచీ సొరంగం ఎప్పుడు పూర్తవుతుందో తెలియక రైతుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ(ఎస్ఎల్బీసీ) సొరంగ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇది పూర్తి కావాలని లక్షలాది మంది రైతులు ఆశతో ఎదురుచూస్తుంటే, అనేక కారణాలతో అంతకంతకూ జాప్యం పెరుగుతోంది. దీంతో ఆ రైతుల నాలుగు దశాబ్దాల కల ఎప్పుడు నెరవేరుతుందన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. పదేళ్ల క్రితం ప్రారంభమై ప్రహసనంలా మారిన సొరంగం తవ్వకాన్ని పూర్తి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే కాంట్రాక్టు సంస్థకు రూ. 100 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. అయినా సమస్యల సుడిగుండం నుంచి సొరంగం నిర్మాణం ఇంకా బయటపడటం లేదు. ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్‌కు తోడు సొరంగం తవ్వకం ద్వారా వచ్చే మట్టిని తరలించే కన్వేయర్ బెల్టు కొనుగోలుకు అదనంగా రూ. 40 కోట్ల వరకు కావాలని కాంట్రాక్టు సంస్థ డిమాండ్ చేస్తోంది. అడిగిన మేరకు నిధులిస్తేనే పనులు సాగుతాయని పేచీకి దిగింది. ఈ మెలికతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. మూడేళ్లలో సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయాలని భావించిన సర్కారుకు ఈ సమస్యలు తలనొప్పిగా మారాయి. ప్రాజెక్టుకు ఎన్నో ఆటుపోట్లు... శ్రీశైలం కుడి గట్టు కాల్వ(ఎస్ఆర్బీసీ) కింద తెలుగుగంగ ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటిని ఆంధ్రా ప్రాంతానికి ఇస్తున్న మాదిరే అంతేస్థాయి నీటిని తెలంగాణకు ఇవ్వాలన్న నిర్ణయంతో ఎస్ఎల్బీసీకి 1980ల్లోనే అంకురార్పణ పడింది. గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యం కానందున సొరంగ మార్గం ద్వారా తరలించాలని నిర్ణయించారు. అయితే ఆర్థిక భారాన్ని సాకుగా చూపి అప్పటి ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి నాగార్జునసాగర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేశాయి. అయితే 2005లో ఎస్ఎల్బీసీ సొరంగ పనులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టింది. రూ. 2,813 కోట్లతో పరిపాలనా అనుమతులు కూడా లభించాయి. ఈ పనులకు రూ.1,925 కోట్లతో జయప్రకాశ్ అసోసియేట్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. మొత్తం 43.89 కిలోమీటర్ల సొరంగ పనుల్లో ఇప్పటివరకు కేవలం 24.68 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.21 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. ఈ పనులకు ఇప్పటికే కాంట్రాక్టు సంస్థ సుమారు రూ.1,300 కోట్లు వరకు ఖర్చు చేసింది. మిగతా పనులకు మరో రూ.650 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉండగా ఆర్థిక భారం కారణంగా పనుల వేగం మందగించింది. అడ్వాన్స్ ఇచ్చినా కదల్లేని పరిస్థితి నిజానికి ప్రాజెక్టు పనులు 2010లోనే ముగియాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలకుతోడు కృష్ణా కింద 2009లో వచ్చిన వరదలు సొరంగం పనులకు అడ్డుగా నిలిచాయి. పనులు చేపట్టే సమయంలో ఉన్న సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు, ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉందని, ఈ దృష్ట్యా రూ.750 కోట్ల వరకు ఎస్కలేషన్ బకాయిలకు తోడు, విదేశాల నుంచి తెప్పించి షిప్‌యార్డుల్లో మూలుగుతున్న సామగ్రిని తెప్పించుకునేందుకు అడ్వాన్స్‌గా రూ.100 కోట్లు చెల్లిస్తేనే పనులు వేగంగా చేస్తామని కాంట్రాక్టు సంస్థ వాదిస్తూ వస్తోంది. 2013లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 మేరకు ఎస్కలేషన్ చార్జీలను చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది. దీనిపై గతంలో చర్చించిన అఖిలపక్షం కేవలం అడ్వాన్స్ చెల్లింపునకు మాత్రమే మొగ్గు చూపగా, ఎస్కలేషన్‌పై ఏమీ తేల్చలేదు. అయితే అడ్వాన్స్ కూడా చెల్లించి మూడు నెలలు గడుస్తున్నా సొరంగ పనుల్లో పెద్ద పురోగతి లేదు. కేవలం 300 మీటర్ల మేర మాత్రమే తవ్వకం జరిగింది. తాజాగా సొరంగంలో తవ్వుతున్న మట్టిని బయటకు పంపేందుకు సుమారు 10 కిలోమీటర్ల కన్వేయర్ బెల్ట్ అవసపరమని, దీనికి దాదాపు రూ.40 కోట్ల వరకు అవసరమని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది. దీన్ని విదేశాల నుంచి తెప్పించాలని, ఎస్కలేషన్ చార్జీల కింద అడుగుతున్న మొత్తంలోంచి దీన్ని చెల్లించాలని పట్టుబడుతోంది. కన్వేయర్ బెల్టులకు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే అవి రెండుమూడు నెలల్లో వస్తాయని, ఆలస్యం చేసిన కొద్దీ పనుల్లో జాప్యం తప్పదని తేల్చి చెబుతోంది. అయితే ఎస్కలేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థ డిమాండ్లపై ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటోంది.