సాక్షి హైదరాబాద్: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రిలో మొత్తం 51 మంది స్టాఫ్ నర్స్ పోస్టులకు గానూ ప్రస్తుతం 41 మంది మాత్రమే ఉన్నారు. కొందరు పదవీ విరమణ పొందగా మరి కొందరు బదిలీపై వెళ్లడంతో 11 స్టాఫ్ నర్స్‌ల ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఓపీ, ఇన్ పేషెంట్ వార్డుల్లో విధులు నిర్వహించే నర్సింగ్ సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఇటీవల సీజనల్ వ్యాధులతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడికి పెరిగింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా అదనపు పడకలు ఏర్పాటు చేసినా ఆరోగ్య శాఖ అదే స్థాయిలో నర్సింగ్ సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోగుల రద్ధీ కనుగుణంగా ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు లేదా నలుగురు నర్సులు ఉండాలి. ఎడతెరిపిలేని వర్షాలకు తోడు పారిశుధ్య సమస్యలు నెలకొనడంతో గతంలో ఎన్నడూలేని విధంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో రోగులు చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సాధారణ రోగులకు ఓపీలో చికిత్సలు అందిస్తున్న వైద్యులు ఇంటికి పంపేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించిన రోగులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగుల రద్ధీకి అనుగుణంగా ఆరోగ్యశాఖ నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో అదనంగా 50 పడకలు ఏర్పాటు చేసింది. అయితే దానికి తగినట్లుగా స్టాఫ్ నర్స్‌ల కొరతకు తోడు అదనపు సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోందని సిబ్బంది వాపోతున్నారు.
వార్డు 2లో ఒక్కరే..
గత ఆదివారం వార్డు 2లో ఒక్క నర్స్ మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. వార్డులో దాదాపు 75 మంది రోగులు ఉండగా ఒక్క నర్స్ మాత్రమే అందరినీ చూసుకోవడం కష్టంగా మారిందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్స్‌ల కొరత ఉన్నప్పుడు అదనంగా ఎన్ని పడకలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదన్నారు. రోగుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని డిప్యూటేషన్‌పై అదనపు నర్స్‌లను నియమించాలని కోరుతున్నారు. సీజన్ ముగిసే వరకు కనీసం నర్సింగ్ విద్యార్థులనైనా సహాయకులుగా నియమించాలని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment