పోరు హోరు
ఊపందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం
బడా నేతలతో పెరిగిన సందడి
టీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహాల రాజకీయం
వరంగల్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు పెంచుతున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయా పార్టీల శ్రేణులు, మద్దతుదారులు వీరి గెలుపునకు ప్రయత్నిస్తున్నాయి. మార్చి 22న జరగనున్న ఎన్నికలో 22 మంది పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ పక్షాన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ తరఫున ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, వామపక్షాలు మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థిగా సూరం ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. శాసనమండలి ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఈసారీ గెలుపు దక్కాలని టీఆర్‌ఎస్ ఈ ఎన్నికను ప్రతి ష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ వ్యూహ బాధ్యతలను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో టీఆర్‌ఎస్ ప్రచారంలో వేగం పెంచింది. తక్కువ సమయంలో మూడు జిల్లాల్లోని పట్టభద్రుల మద్దతు పొం దేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్‌రెడ్డి ప్రచా రం చేస్తున్నారు. మూడు జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఎన్నికలో నిమగ్నమయ్యారు.
ముమ్మరంగా ప్రచారం
బీజేపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు నవంబర్‌లోనే ఖరారయ్యారు. అప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాష్ట్ర స్థాయి నేతలు ఒక్కొక్కరు జిల్లాకు వచ్చి ప్రచారంలో పాల్గొని వెళ్తున్నారు. వచ్చే వారంలో జాతీయ స్థాయి నేతలు ఎన్నిక ప్రచారానికి వస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గా బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుం టోంది. ఈ ఎన్నికలో బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తోం ది.
గత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న(నవీన్) వరంగల్‌లో ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ యాసతో ఉద్యమం సమయంలో వచ్చిన ఆదరణకు తోడు కాంగ్రెస్ మద్దతుపై మల్లన్న ఆశావాహంగా ఉన్నారు. వామపక్షాలు మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థిగా సూరం ప్రభాకర్‌రెడ్డి జిల్లాలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రభాకర్‌రెడ్డికి వామపక్షాల మద్దతు ఇస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అనుకూల పరిస్థితి ఉందని ఈయన శిబిరం భావిస్తోంది. మిగిలిన రెండు జిల్లాల్లో ప్రచారంపై దృష్టి పెడుతున్నారు.