జైపూర్‌లో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం
మొదటి ప్లాంటు ద్వారా 587 మెగావాట్లు
గజ్వేల్ పవర్ గ్రిడ్‌కు సరఫరా
మే చివరికల్లా 1,200 మెగావాట్ల ఉత్పత్తి
జైపూర్: సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి సమీపంలో చేపట్టిన 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులోని యూనిట్-1(600 మెగావాట్లు)లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ మొదటి యూనిట్ ప్లాంటును సింక్రనైజేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. సింగరేణి, బీహెచ్‌ఈఎల్ ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో, ఎన్టీపీసీ ఉన్నతాధికారుల నేతృత్వంలో కీలకమైన సింక్రనైజేషన్ ప్రక్రియ కొనసాగింది. మొదటి యూనిట్ బాయిలర్‌లో టర్బైన్, జనరేటర్(టీజీ)వద్ద సీఎండీ శ్రీధర్ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం సీసీఆర్ కంట్రోల్‌రూం వద్ద కంప్యూటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివిధ భాగాలు, యంత్రాల సమూహాన్ని అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. మొదటిరోజు యూనిట్-1 ప్లాంట్ ఒక నుంచి ప్రారంభమై 587 మెగావాట్ల ఉత్పత్తిని సాధించారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను 400 కేవీ స్విచ్ యార్డు ద్వారా గజ్వేల్ పవర్ గ్రిడ్‌కు వెళ్లింది.
కేసీఆర్ చేతులమీదుగా జాతికి అంకితం..
జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మేలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా జాతికి అంకితం చేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ కేంద్రంలోని రెండో యూనిట్‌ను వచ్చేనెలలో సింక్రనైజేషన్ చేసి.. మే వరకు సీవోడీ చేస్తామని, తద్వారా 1,200 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ ప్రజలకు అందిస్తామని ఆయన వివరించారు. యూనిట్-1 సింక్రనైజేషన్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లను ఆరేళ్లలో సింక్రనైజేషన్ చేస్తే.. సింగరేణి సంస్థ పవర్‌ప్లాంటులో నాలుగేళ్లలోనే విజయవంతంగా సింక్రనైజేషన్ చేశామని చెప్పారు. జైపూర్ ప్లాంటు ద్వారా వచ్చే రెండు నెలల్లో పూర్తిస్థాయిలో 1,200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని, దీంతో రాష్ట్రంలోని వ్యవసాయ, వాణిజ్య, గృహాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలి పారు. ప్లాంటు నిర్వహణ జర్మనీకి చెందిన స్టిగ్ కంపెనీకి అప్పగించామని తెలిపారు. భూనిర్వాసితులకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్లు రమేశ్‌బాబు(ఈ అండ్ ఎం), మనోహర్‌రావు(పీపీ), పవిత్రన్‌కుమార్(ఫైనాన్స్), ఈడీ సంజయ్‌కుమార్‌సూర్, జీఎంలు సుధాకర్‌రెడ్డి, మురళీకృష్ణ, సుభానీ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి, ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు, ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి సీతారామయ్య, హెచ్‌ఎంఎస్ ప్రధానకార్యదర్శి రియాజ్ అహ్మద్,వివిధ కంపెనీల అధికారులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.