సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అమలు చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం కానుంది. సమ్మె 27 రోజులకు చేరడంతో ప్రజలకు అసౌకర్యం, ఆర్టీ సీకి నష్టాలు పెరిగిపోయాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆర్టీసీ యూని యన్లు తరచూ సమ్మెకు వెళ్తున్నాయని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో తీర్చగలిగినవి ఎన్ని? తీర్చలేనివి ఎన్ని? సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఆర్టీసీ భవితవ్యంపై తీవ్ర కసరత్తు చేస్తున్న సీఎం, నిపుణులతోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కేంద్రం అమలుచేస్తున్న రవాణా చట్టంపైనా సీఎం సమగ్ర అధ్యయనం చేసినట్లు ఆయన సన్ని హిత వర్గాలు తెలిపాయి. దీనిని క్రోడికరించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
విలీనంపై ఏం చేద్దాం?
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని కార్మిక నేతలు పట్టుబట్టుతున్నారు. విలీనం అసాధ్యమని, దేశంలో ఇంతవరకు ఎక్కడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదని ప్రభు త్వం వాదిస్తోంది. విలీనం చేయాలన్నదే తమ డిమాండ్ కాదని యూనియన్లు కోర్టుకు తెలిపాయని, కానీ సరూర్‌నగర్ సభలో మళ్లీ విలీనం డిమాండ్ చేశాయని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో ఏమి చేయాలనే విషయంలో సీఎం సమాలోచనలు జరుపుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది?
ఇతర రాష్ట్రాలు ఆర్టీసీ విషయంలో అనుసరించిన విధానాలపైనా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆర్టీసీని మూసేశారని, ఆ రాష్ట్రాలతోపాటు జార్ఖండ్‌లోనూ ప్రభుత్వరంగ రవాణా లేదు. ఉత్తరప్రదేశ్‌లో 12 వేల బస్సులే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వద్ద ఉన్నాయి. బిహార్‌లో 600 ఆర్టీసీ బస్సులుండగా పశ్చిమ బెంగాల్‌లో 10 వేల రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు బస్సులను నడిపిస్తున్నారని అధికారులు సీఎంకు నివేదించారు. పార్లమెంటు ఇటీవల ఆమోదించిన మోటారు వాహన సవరణ చట్టంలో రవాణా రంగంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొల్పేందుకు ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది.
దీని ఆధారంగానే రాష్ట్రంలో దాదాపు 4 వేల రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లకు పర్మిట్లు జారీ చేసే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఆర్టీసీ సమ్మె విషయంలో విపక్షాలు అనుసరిస్తున్న వైఖరిపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. ఆర్టీసీలో 31 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్టీసీ నష్టాల్లోనూ 31 శాతం వాటాను భరించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని పూర్తిగా మూసేసి ఇక్కడ మాత్రం విలీనం డిమాండ్ చేస్తున్నారని సీఎం మండిపడినట్లు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment