జోన్లు రద్దయితే మరో ముప్పు..!
► రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ ఓపెన్ కోటానే..
► స్థానికులకు పొరుగు రాష్ట్రాల అభ్యర్థుల పోటీ
► మల్లగుల్లాలు పడుతున్న అధ్యయన కమిటీ
► స్థానికులకు అన్యాయం జరగకుండా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వులతో ముడిపడి ఉన్న అంశం కావటంతో కేంద్రానికి డ్రాఫ్ట్‌ను పంపించే ముందే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరమైన మార్గదర్శకాలు, కేంద్రానికి పంపించే నివేదికను తయారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ఎస్‌పీ సింగ్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది.
కసరత్తు ముమ్మరం చేసిన కమిటీ..
ఉద్యోగ వ్యవస్థలో ప్రస్తుతమున్న మూడంచెల విధానానికి బదులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో రెండంచెల విధానంలోనే పోస్టులుండేలా ఈ కమిటీ తమ కసరత్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వరుసగా రెండు రోజులు వివిధ శాఖాధిపతుల అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా జోనల్ వ్యవస్థ రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో సర్కారు అప్రమత్తమైంది. ప్రధానంగా రాష్ట్ర కేడర్ పోస్టుల భర్తీ విషయంలో స్థానికులు నష్టపోయే ప్రమాదముంటుందనే వాదనలు తెరపైకి వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ ఓపెనే..
ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతోంది. అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా స్థాయి పోస్టుల్లో లోకల్ 80 శాతం, ఓపెన్ 20 శాతం.. జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, మల్టీ జోనల్ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ కేటగిరీగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల భర్తీకి లోకల్ రిజర్వేషన్ ఉండదు. మొత్తం ఓపెన్ కోటాగానే పరిగణిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జోనల్ స్థాయిని తొలగించి ఉద్యోగాలను జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుగా పునర్వ్యవస్థీకరించే పని పెట్టుకుంది. రాష్ట్రంలో రెండే కేడర్‌లు ఉండనుండటంతో సూపరింటెండెంట్ స్థాయి వరకు జిల్లా పోస్ట్‌లుగా, ఆపై స్థాయి పోస్టులన్నీ రాష్ట్ర పోస్టులుగా చేయాలని చర్చ జరుగుతోంది. జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులను రాష్ట్ర స్థాయిలో చేర్చాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో కీలకమైన పోస్టులకు లోకల్ రిజర్వేషన్ వర్తించకుండా పోతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సైతం వీటి కోసం పోటీ పడే వెసులుబాటు ఉంటుంది.
పొరుగు రాష్ట్రాల అభ్యర్థుల పోటీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాషా సమస్యతో రాష్ట్ర స్థాయి పోస్టులకు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఏపీకి చెందిన వాళ్లు ఇక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశముంటుంది. లోకల్ రిజర్వేషన్ లేకపోవటంతో ఇంచుమించుగా సమాన సంఖ్యలో, ఒక్కోసారి ఎక్కువ సంఖ్యలో వారికి ఉద్యోగాలు దక్కే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవు తోంది. మరోవైపు పోస్టుల పునర్వ్యవ స్థీకరణతో రాష్ట్ర స్థాయి పోస్టుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. అప్పుడు తెలంగాణ స్థానికులకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థానికులకు అన్యాయం జరగకుండా కసరత్తు..
తెలంగాణ స్థానికులకు అన్యాయం జరగకుండా ఉండేలా జోన్ల పునర్వ్యవస్థీకరణ ఉండేలా తదుపరి కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించడం కుదరదని నిపుణులు అంటున్నారు. దీంతో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది.. స్థానికులకు న్యాయం జరిగేలా ఎలాంటి మార్గదర్శకాలను పొందుపరుస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి ఏపీలో జోనల్ పోస్టులను కుట్రపూరితంగా రాష్ట్ర పోస్టులుగా మార్చారని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఉద్యమ సమయంలోనే ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో జోన్ల రద్దుతో కొత్త చిక్కులు తలెత్తుతాయా..? తెలంగాణలోని నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఎలాంటి మార్గదర్శకాలు పొందుపరచాలనేది అధికారుల కమిటీకి సవాలుగా మారింది.