‘న్యూఇయర్’కు నిబంధనలు
* ఆంక్షలు విధించిన నగర పోలీసులు.. ఔటర్ రింగ్ రోడ్డుపై నిషేధాజ్ఞలు
* డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకే సంబరాలకు అనుమతి
* మద్యం సేవించి వాహనాలు నడపరాదు.. 200 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ప్రణాళికతో పాటు నిబంధనలను సైతం సిద్ధం చేశారు. గతేడాది న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు పక్కా ప్రణాళికతో బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోలేదు. ఈ ఏడాది కూ డా ఈ వేడుకలను ప్రశాంతంగా జరిపేందుకు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు కసరత్తు చేపట్టారు. బుధవారం సైబరాబాద్ కమిషరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో స్టార్ హోటళ్లు, పబ్‌లు, ఫాంహౌజ్ నిర్వాహకులతో సీవీ ఆనంద్ ప్రత్యేక సమావేశం నిర్వహిం చి నూతన సంవత్సర వేడుకలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను వివరించారు.
హద్దుమీరితే దండనే... న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు
ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వేడుకల్లో అపశ్రుతులు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మద్యం తాగి ఎవ్వరూ డ్రైవింగ్ చేయరాదు. త్రిబుల్ రైడింగ్‌కు పాల్పడినా దండన తప్పదు. పోలీసులు విధించిన నిబంధనలు పాటించాలి. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలు జరపాలి. సమయపాలన పాటించని హోటళ్లపై కేసులు నమోదు చేస్తాం.
- మహేందర్‌రెడ్డి, కమిషనర్
సైబరాబాద్‌లో 25 స్టార్ హోటళ్లు, 3 పబ్స్, 22 రిసార్ట్స్, 269 ఫాంహౌజ్‌లలో ఈ వేడుకలు జరుగనున్నాయి. నగరంలోని హోటళ్లు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వేడుకల్లో మద్యం సేవించిన తరువాత వాహనాలు నడపరాదని, అలా నడిపే వారిపై నిఘా పెట్టామని, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు జాతీయ రహదారులపై సైబరాబాద్‌లోని మొత్తం సిబ్బంది 7,500 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విధులు నిర్వహిస్తారని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి తెలిపారు. అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ పేర్కొన్నారు.
వేడుకల నిబంధనలివీ...
- కార్యక్రమాల నిర్వహణకు రాత్రి 8 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి.
- కార్యక్రమాన్నంతా సీడీలో నిక్షిప్తం చేసి కమిషనర్‌కు నిర్వాహకులు అందజేయాలి.
- ఒంటిగంట తరువాత కూడా కార్యక్రమం కొనసాగితే కేసులు నమోదవుతాయి.
- జంటలను మాత్రమే అనుమతించాలి. ఒంటరిగా అబ్బాయినిగాని, అమ్మాయినిగాని అనుమతించరాదు. ఆహ్వానం ఉన్నవారినే లోపలికి అనుమతించాలి.
- అనుమతిలేనిదే బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లు, హోర్డింగులు ప్రదర్శించరాదు.
- 1974 గేమింగ్ చట్టం వర్తించే ఆటలు నిర్వహించరాదు. డీజే సౌండ్ నిషేధం. 45 డెసిబిల్స్ కంటే మించి శబ్దాలు రాకూడదు.
- నగ్న ప్రదర్శనలు, అశ్లీల చిత్రాల ప్రదర్శనలు, నృత్యాలపై నిషేధం ఉంది.
- ప్రచార పత్రాలు, హోర్డింగులలో అశ్లీలత ఉండరాదు.
- ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం పంపిణీ చేయరాదు. మద ్యం సేవించి గొడవ చేసే వారిని అరికట్టాలి.
- బాణాసంచా కాల్చరాదు. అగ్నిమాపక శాఖ అధికారుల సూచనలు పాటించాలి.
- ఆహ్వానితులకు పోలీసుల నిబంధనలు ముందుగానే వివరించాలి.
- సీట్లకు మించి ఆహ్వానితులు ఉండరాదు.
- తాగి వాహనాలు నడపకూడదు.
ప్రతి రహదారిపై పోలీసు నిఘా
- వేడుకల నిర్వాహకులే సొంతంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని ట్రాఫిక్‌ను సరి చేసుకోవాల్సి ఉంటుంది.
- పార్కింగ్ ప్రదేశాలలోనే వాహనాలు పార్క్ చేయాలి. ఎక్కడపడితే అక్కడ రోడ్డుపై పార్క్ చేస్తే సీజ్ చేస్తారు.
- జంట పోలీసు కమిషనరేట్లలో 200 ప్రాంతాలలో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.
- డ్రంకెన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తె పోలీసులు చలానా విధిస్తారు.
- నగరంలో అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తారు.
ఓఆర్‌ఆర్‌పై నిషేధాజ్ఞలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై నిషేధాజ్ఞ లు విధిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. సైబరాబా ద్ పరిధిలోని ఫ్లైఓవర్లను మూసివేస్తారు.
- 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గం. వరకు ఓఆర్‌ఆర్‌తో పాటు ఇతర ప్రాంతాలలో ట్రాఫిక్‌పై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి.
- ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఓఆర్‌ఆర్‌పై అనుమతించరు.
- విమాన ప్రయాణికులు కారులో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. అయితే వారు విమాన ప్రయాణ టికెట్లు చూపించాల్సి ఉంటుంది.
- సాధారణ ప్రయాణికులు కారులో ప్రయాణించడంపై ఆంక్షలు విధించారు.
- కేవలం భారీ సరుకు రవాణా వాహనాలు, చిన్నపాటి గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
- పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్ పూర్తిగా మూసివేస్తారు.
- ఫతేనగర్, హఫీజ్‌పేట ఫ్లైఓవర్‌లపై మాత్రం ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.
- వేడుకలలో పాల్గొనే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.