'గాలి' తీసి మరీ వెళ్లాడు
తుమ్మల నాగేశ్వరరావు... సైకిల్ చక్రాల్లో గాలి తీసి మరీ కారు ఎక్కేశాడని ఖమ్మం జిల్లాలోని తెలుగుతమ్ముళ్తు తెగ ఇదైపోతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ సింగిల్ సీటు మాత్రమే గెలుచుకుందని... ఆయన ఈ పనేదో శాసనసభ ఎన్నికల ముందు చేసి ఉంటే జిల్లాలో పార్టీకి మరిన్నీ సీట్లు వచ్చేవని పచ్చ తమ్ముళ్లు అనుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది. ఆ తర్వాత స్థానాన్ని టీడీపీ 15 స్థానాలతో నిలిచింది. అదేదో తుమ్మల ముందే కారు ఎక్కిఉంటే తమ పాట్లు ఏవో తామే పడి... జిల్లాలో 10 స్థానాల్లో కనీసం సగానికిపైగా సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవారమని చెబుతున్నారు. ఆ ఛాన్స్ కావాలనే మిస్ చేశాడని తుమ్మలపై పచ్చ తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఆయన ఒక్కడే పోకుండా జిల్లాలోని పార్టీకి చెందిన ముఖ్యనేతలు అనుచరగణాల పచ్చ కండవాలను మరీ విప్పించి గులాబి కండువాలు కప్పించారని వారు ఆరోపిస్తున్నారు. దాంతో జిల్లాలో దాదాపు పచ్చ పార్టీ పరిస్థితి హ్యాండిల్ మాత్రమే మిగిలిన సైకిల్లా ఉందని ఫీలైపోతున్నారు. నామాతో పాటు మరి కొందరు నేతలు ఉన్నా జిల్లాలో పచ్చపార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఇప్పడప్పుడే సాధ్యం కాదని అవేదన పడిపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు గెలుచుకున్న టీడీపీ... భవిష్యత్తులో ఆ ఒక్కసీటు కూడా కోల్పోయే పరిస్థితి ఉందని... ఇక పార్టీకి పూర్వవైభవం రావాలంటే ఎన్నాళ్లు పడుతుందోనని పచ్చ తమ్ముళ్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.