
హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
హన్మకొండ సిటీ : హక్కుల సాధనకు విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం-327(ఐఎన్‌టీయూసీ అనుబంధ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోఆర్డినేటర్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ వడ్డేపల్లి రోడ్డులోని పల్లె రవీందర్‌రెడ్డి భవన్‌లో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ విద్యుత్ వర్కర్స్ యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఇందులో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన అన్ని విభాగాల విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చినందున కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసే అవకశాలున్నాయని, ఎవరికి వారుగా చీలిపోకుండా ఒకే వేదికపైకి రావాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం వల్ల సిబ్బంది కొరత సమస్య తీరుతుందన్నారు.
యూనియన్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్‌లో కాంట్రాక్ట్ పద్ధతిపై సబ్‌స్టేషన్ అపరేటర్లు, వాచ్‌మెన్‌లు, అటెండర్‌లు, స్వీపర్లు, డ్రైవర్లు, స్పాట్ బిల్లర్లు, కలెక్షన్ ఏజెంట్లు పని చేస్తున్నారని, అందరినీ రె గ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు.
సమావేశంలో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ పరిధి అధ్యక్షుడు దారావత్ సికిందర్, కార్యదర్శి యుగంధర్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు మహేందర్‌రెడ్డి, కె.హన్మంత్‌రాావు, జస్వంత్‌కుమార్, విజయ్‌కుమార్, శ్రీనివాస్, గంగాధర్, మోహిద్, గోపాల్‌రాావు, శ్రీనివాస్‌రావు, విజయగోపాల్, మోహిసిన్‌ఖాన్, నాగమల్లు తదితరులు పాల్గొన్నారు.