ప్రతిభ ఉంది.. కానీ పైసల్లేవు..
► పదోతరగతిలో 9.8 జీపీఏ
► దాత సహాయంతో ఇంటర్మీడియట్ పూర్తి
► ఇంజినీరింగ్ చదివేందుకు పైసల్లేవు
► తండ్రికి అంగవైకల్యం.. కూలి పనిచేస్తున్న తల్లి
► ఆర్థిక చేయూత కోసం ఎదురుచూపు
శంషాబాద్(రాజేంద్రనగర్): చదువుల్లో చురుకైన ఆ విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఒకవైపు.. కుటుంబ పరిస్థితి మరోవైపు దీంతో ఆ విద్యార్థి కొట్టుమిట్టాడుతున్నాడు. తన కుమారుడికి ఉన్నత చదువులు చదివించేందుకు పెద్ద మనసు చేసుకొని ఎవరైనా సహాయం చేయాలని అంగవైకల్యంతో బాధపడుతున్న తండ్రి కోరుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా ఎండీహెచ్‌పల్లి గ్రామానికి చెందిన ఎం.మధుసూదన్‌రెడ్డి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చెయ్యి పోగొట్టుకున్నాడు. అంగవైకల్యంతో వ్యవసాయం చేయలేక పొట్టచేత పట్టుకొని 15 ఏళ్ల క్రితం మధుసూదన్‌రెడ్డి కుటుంబం సాతంరాయి గ్రామానికి వలస వచ్చింది.
భర్త ఎలాంటి పని చేయలేకపోవడంతో మధు భార్య రాజవేణి పరిశ్రమలో కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. వీరి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పదోతరగతిలో 9.8 మార్కులు సాధించడంతో ఓ ఉపాధ్యాయుడి ఆర్థిక సహకారంతో నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఎంసెట్‌లో 14,904 ర్యాంకు సాధించడంతో దుండిగల్‌లోని ఐఏఆర్‌ఈ కళాశాలలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది.
ఫీజు రియంబర్స్‌మెంట్ పోను ట్యూషన్, హాస్టల్ ఇతరత్రా ఫీజులు చెల్లించడానికి వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. కళాశాలలో చేరేందుకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండడంతో బిడ్డను చదివించుకోలేకపోతున్నామని ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ కుమారుడి చదువుకు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.
కష్టపడి చదువుకుంటా..
ఆర్థిక ఇబ్బందులన్నా ఇప్పటి వరకు కష్టపడి చదువుకుంటూ వచ్చాను. ఉన్నత చదువులు చదివి నా కుటుంబ పరిస్థితి మెరుగు పర్చాలన్నదే నా లక్ష్యం. కానీ ఇంజినీరింగ్‌లో చేరేందుకే మా దగ్గర డబ్బులు లేవు. ఇంకా నాలుగు రోజుల సమయమే ఉంది. ఎవరైనా నా చదువుకు సహకరించండి. – ఎం. శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థి