కొత్త కలెక్టర్‌కు జిల్లా విద్యార్థి గోడు
సమయానికి రాని ఉపాధ్యాయులు
నత్తనడకన పాఠశాలల భవనాల నిర్మాణం
వెక్కిరిస్తున్న ఉపాధ్యాయుల కొరత
సగం పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు కరువు
కొత్త కలెక్టర్‌కు జిల్లా విద్యార్థుల గోడు
మహారాజశ్రీ జిల్లా కలెక్టర్ ఇలంబరితి గారికి,
నమస్కరించి రాయునది.
నేను ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థిని. కొత్తగా వచ్చిన మిమ్మల్ని నేరుగా కలిసి మా సమస్యలు చెప్పుకోవాలని, నాతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తోటి విద్యార్థులందరి గోడు విపినించాలని అనుకున్నాను. కానీ, మిమ్మల్ని నేరుగా కలవలేక.. జిల్లాలో దారితప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెడతారనే గంపెడాశతో ఈ ఉత్తరం రాస్తున్నాను. దయచేసి పరిశీలించగలరు.
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు 3336 ఉన్నాయి. వీటిలో 1624 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 68 పాఠశాలలకు అసలు ఉపాధ్యాయులే లేరు. 686 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఏ కారణంగానైనా ఉపాధ్యాయుడు రాకపోతే ఆ రోజున బడికి సెలవే.
జిల్లాలోని 46 మండలాలకుగాను 41 చోట్ల ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఉపాధ్యాయులు లేని, పదోతరగతి సబ్జెక్ట్ టీచర్లు లేని పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ కొందరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపించారు. ఇందులో అక్రమాలు జరిగాయని, అధికార.. అండ బలమున్న వారికి వారు కోరుకున్న పాఠశాలలో వేశారని ఆరోపణలు వచ్చాయి. డిప్యుటేషన్‌పై వెళ్ళేందుకు కొందరు ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. ఈ కారణంగా జిల్లాలోని 30 పాఠశాలల్లో పదోతరగతి ముఖ్యమైన సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కరువయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో ఎక్కువమంది ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ కారణంగా వారు సమయ పాలనను విస్మరిస్తున్నారు. వీరికి.. బస్సు టైం, ట్రైన్ టైమే బడి టైంగా మారింది. వర్షం వచ్చినా, సమయానికి బస్సు/రైలు రాకపోయినా (ఏకోపాధ్యాయ పాఠశాలలకు) ఆ రోజు సెలవన్నట్టే..!
పాఠశాలల్లో స్వీపర్లు లేకపోవడంతో ఊడ్చి, నీళ్లు చల్లే పనులను మేమే చేసుకుంటున్నాం.
20012-13, 20013-24 విద్యాసంవత్సరాలలో జిల్లాలో 1500 అదనపు తరగతి గదులకు నిధులు కావాలని జిల్లా అధికారులు ఉన్నతాధికారులను కోరితే రూ.38.78కోట్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటివరకు 1358 అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభమైంది. ఇవి పూర్తికాకపోవడంతో శిథిలావస్థకు చేరిన గదుల్లోనే మేము బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నాం.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండాలని అధికారులు మీటింగులు పెట్టి చెబుతున్నారు. జిల్లాలోని పాఠశాలలకు ఇంకా 1867 మరుగుదొడ్లు అవసరమని అధికారులు లెక్క తేల్చారు. కానీ, వీటి నిర్మాణం మాత్రం చేపట్టలేదు. ఆర్వీఎం, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా సుమారు 250 మరుగుదొడ్ల నిర్మాణం నిలిచిపోయింది.
జిల్లాలో 238 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు నీళ్లు కూడా లేవు. ఆడ పిల్లల పరిస్థితి వర్ణణాతీతం.
మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు గత సంవత్సరం రెండుకోట్ల బకాయిలు ఉన్నాయి. బిల్లులు అందకపోవడంతో ఏజెన్సీలు నాసిరకం భోజనం పెడుతున్నారు.
కంప్యూటర్ విద్యను నేర్పిస్తామంటూ పాఠశాలకు కంప్యూటర్లు పంపించారు. గత సంవత్సరం వరకు సార్లు కంప్యూటర్ క్లాసులు చెప్పారు. వారిని తొలగించడంతో కంప్యూటర్లకు మూలనపడ్డాయి.
ఈ సమస్యలను పరిష్కరిస్తారని, మా చదువులు సరిగ్గా సాగేలా చూస్తారని, మా భవితకు బంగరు బాట వేస్తారని కొండంత ఆశతో ఈ లేఖ రాశాను.
ఇట్లు
తమ విధేయుడు,
ప్రభుత్వ పాఠశాలలో చదువున్న ఓ విద్యార్థి
ఖమ్మం
నేరుగా కలవలేక... రాస్తున్నా ఈ లేఖ..
Published Sun, Aug 3 2014 3:37 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement