► నేడు లక్కీ డ్రా ద్వారా మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల ఎంపిక
► హైదరాబాద్ మినహా 30 జిల్లాల్లో అడ్మిషన్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు అదృష్టం పరీక్షించుకోవాల్సిందే. 2017–18 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాల్లో 5, 6, 7 తరగతుల్లో లక్కీ డ్రా ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. హైదరాబాద్ జిల్లాలోని 31 పాఠశాలలు మినహా మిగిలిన 30 జిల్లాల్లో 170 పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం 201 గురుకులాల్లోని 5, 6, 7 తరగతుల్లో 35 వేల సీట్లు ఉండగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సుమారు 85 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో దరఖాస్తులు చేసుకునే గడువు ఈ నెల 15 వరకు ఉండటంతో 19వ తేదిన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టెమ్రీస్) ప్రకటించింది.
మొత్తం 210 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రారంభిస్తున్న 118 గురుకుల పాఠశాల్లో ఐదు, ఆరు, ఏడు తరగతుల్లో, గతేడాది ప్రారంభించిన 71 పాఠశాలలతోపాటు విద్యాశాఖ నుంచి బదిలీ అయిన 12 పాఠశాలల్లో కేవలం 5వ తరగతిలో మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. లక్కీ డ్రా అనంతరం విద్యార్థుల జాబితాను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించనున్నారు. మొత్తం సీట్లలో మైనారిటీలైన ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు 75 శాతం, మైనారిటీయేతరులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ/ఈబీసీలకు 25 శాతం ప్రాతిపదికన ప్రవేశం కల్పించనున్నారు.
లక్కీ డ్రాలో తల్లిదండ్రులు పాల్గొనాలి
మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఐదు, ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించే లక్కీ డ్రా లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బి.షఫీ ఉల్లా కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన మాంటిస్సోరి విద్యా బోధన, వసతులు అందిస్తున్నామన్నారు. బాలికలకు గట్టి భద్రత కల్పిస్తున్నామన్నారు.
అదృష్టం ఉంటేనే ఆ గురుకులాల్లో ప్రవేశాలు!
Published Thu, Apr 13 2017 1:08 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement
Advertisement