వారంతా విద్యార్థులు. ఓవైపు చదువుకుంటూ... మరోవైపు సేవాపథంలో నడుస్తున్నశ్రీమంతులు. వీరందర్ని నడిపిస్తోందిహైదరాబాద్ యూత్ అసెంబ్లీ (హెచ్‌వైఏ). ముగ్గురు స్నేహితుల మనసులో అంకురించిన ఆలోచన.. నేడు మరెందరినో సేవా మార్గంలో నడిపిస్తోంది. గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోంది.
హిమాయత్‌నగర్: నగరానికి చెందిన అఖిలేష్ జుక్కారెడ్డి, మితేష్ లోహియా, స్నిగ్ధా చల్లపల్లి స్నేహితులు. ప్రతిరోజు ఏదో ఒక రెస్టారెంట్‌లో లంచ్ చేసి.. కొద్దిసేపు మాటామంతీ వీరికి అలవాటు. అలా 2009లో ఓ రోజు హోటల్‌లో లంచ్ అనంతరం బయటకొస్తుండగా ఓ వ్యక్తి దగ్గరికొచ్చి చేయిచాచడం వీరిని కదిలించింది. ఆ క్షణాన పుట్టిన ఆలోచనే.. నేడు వేలాది మందిని సేవాపథంలో నడిపిస్తోంది. ప్రతిరోజు మెయింటనెన్స్‌కు ఎన్నో రూపాయలు ఖర్చు చేస్తున్నాం కదా.. ఆ ఖర్చుకు ఫుల్‌స్టాప్ పెట్టి, దానితో సేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకున్నారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (హెచ్‌వైఏ) పేరుతో ఓ ఎన్జీఓ ఏర్పాటు చేశారు. ఇందులో మరో భాగమే స్ట్రీట్‌కాజ్ సంస్థ.
మూడు గ్రూపులు.. 30 మంది
పేదరిక నిర్మూలన, ఆకలి తీర్చడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం, మహిళా సాధికారత, ఉన్నత విద్యనందించడం, స్వచ్ఛభారత్, ఆర్థిక చేయూత, గ్రామాల అభివృద్ధి తదితర లక్ష్యాలతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇందులోని సభ్యులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 30 మంది చొప్పున ప్రజలకు సేవలందిస్తారు. అకృత్యాలను అరికట్టేందుకు అవగాహనసదస్సులు, చర్చా కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఖర్చులు వీరు సొంతంగానే భరిస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్‌లో చేరేటప్పుడు ఒక్కో సభ్యుడు రూ.10 వేలు కట్టాల్సి ఉంటుంది. మొత్తం మూడు గ్రూపుల్లో 30 మంది సభ్యులుంటారు. ఈ సభ్యులు వ్యక్తిగతంగా ఇచ్చే డబ్బులతోనే సేవలందిస్తున్నారు.
మూడు గ్రామాల దత్తత...
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. హెచ్‌వైఏ స్ట్రీట్‌కాజ్ ప్రతినిధులు తమ వద్దనున్న ఫండ్ ఆధారంగా గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలోని లెండిగూడ గ్రామాన్ని దత్తత తీసుకోగా... ఇప్పుడు చేవేళ్ల వద్దనున్న ఇక్కారెడ్డిగూడ, రెడ్డినాయక్‌తండాలను దత్తత తీసుకున్నారు. గ్రామాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కరెంట్, బల్బుల పంపిణీ, తాగునీరు, ఉచిత విద్య, పర్యావరణంపై అవగాహన... ఇలా వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే చికిత్సకు ఖర్చులు కూడా భరిస్తున్నారు.
తండా కోసం 10కే రన్
జడ్చర్ల శివారులోని లక్యానాయక్ తండాలో సుమారు 200 కుటుంబాలునివసిస్తున్నాయి. ఇక్కడ కనీస వసతులేమీ లేవు. ఇది తెలుసుకున్న స్ట్రీట్‌కాజ్ సంస్థ ఈ గ్రామానికి సహాయం అందించాలని నిర్ణయించుకుంది. గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఏప్రిల్ 1న నెక్లెస్ రోడ్‌లో 10కే రన్ నిర్వహించనుంది. ఈ రన్‌లో పాల్గొనేవారు రూ.100 చెల్లించి పాస్ తీసుకోవాలి. దీని ద్వారా వచ్చే మొత్తంతో గ్రామంలో సౌకర్యాలు కల్పిస్తామని స్ట్రీట్‌కాజ్ ప్రతినిధి మధుచంద్ర తెలిపారు.
మన బాధ్యత..
మొదట ఈ ఆర్గనైజేషన్ గురించి కొందరు స్నేహితులు చెప్పినప్పుడు... హే ఏం చేస్తారులే అనుకున్నాను. కానీ సేవా కార్యక్రమాలు చూశాక నాకూ చేరాలని అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా ఆర్గనైజేషన్‌లో చేరిపోయాను. సమాజానికి సేవ చేయడం మన బాధ్యత. – మధుచంద్ర, అసోసియేట్ ప్రెసిడెంట్
అదే ఆనందం..
సేవా కార్యక్రమాల్లో భాగంగా చాలా మందిని కలుస్తుంటాం. వాళ్లతో మాట్లాడినప్పుడు వారి మోముల్లో వచ్చే చిరునవ్వులు మాకెంతో ఆనందాన్ని ఇస్తాయి. చిన్న వయసులో ఇదంతా మీకెందుకు అన్నవాళ్లూ ఉన్నారు. అయినా సేవా చేయాలనే తపనతోనే ముందుకెళ్తున్నాం.– తన్వీ, వైస్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment